పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి
ఆలేరు,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన వంట కార్మికుల పెండింగ్ బిల్లుల(Pending bills of cooking workers)ను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతనాన్ని అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వంట కార్మికులు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తొమ్మిది నెలల పెండింగ్ బిల్లులతో పాటు ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని, సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని ఇమ్రాన్ కోరారు.
వంట కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత కల్పించాలని, కోడిగుడ్లు, గ్యాస్, నిత్యావసరాల ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు గనబోయిన వెంకటేష్, కోశాధికారి సామల శోభన్‌బాబు, బాగుల వసంత, ముంతాజ్ బేగం, రాజమణి, బచ్చమ్మ, శ్యామ్, పద్మ, రజిత, మంజుల, అరుణ, లీలా, అండాలు, సుమీల, వరమ్మ, వీరాస్వామి, హరిత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.