సీఎంసీ ఆదేశాలు భేఖాతర్

16-09-2026 | 09:46pm

ముడుపుల కోసమే పైపై కూల్చివేతల..?

దుండిగల్ లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ పాక్షిక చర్యలు

పేదలపైనే ప్రతాపం... పెద్దలపై చర్యలు శూన్యం 

స్పందించని దుండిగల్ సర్కిల్ డీసీ

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దుండిగల్(Dundigal) సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై(illegal constructions) అధికారుల పాక్షిక చర్యలు రోజురోజుకి చర్చనీయంశంగా మారుతుంది. అక్రమ నిర్మాణాలపై చర్యలు అంటూ కేవలం బాల్కనీలను మాత్రమే ఎంచుకొని పై పై కూల్చివేతలతో నిర్మాణదారులను తమ దారికి మల్లించుకుంటున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎంసీ కమిషనర్ సృజన అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కానీ దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారులు(Dundigal Town Planning Officers) మాత్రం వాటిని భేఖాతర్ చేస్తూ వారు ఎంచుకున్న అక్రమ నిర్మాణలపైన మాత్రమే పాక్షిక కూల్చివేతలతో సెటిల్మెంట్ల్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.పెద్ద పెద్ద అక్రమ నిర్మాణాలను వదిలేసి చిన్న వాటిపై మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

అనుమతులు రెండు... నిర్మాణం ఒకటే...

దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో రాస్తా హోటల్ పక్కన ఓ నిర్మాణదారుడు రెండు అనుమతులు తీసుకొని ఒకే నిర్మాణం చేపడుతున్నాడు.అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్లార్, అదనపు అంతస్థులు నిర్మిస్తూ చట్టానికి సవాల్ విసురుతున్నాడు. సదరు అక్రమ నిర్మాణంపై ఫిర్యాదులు వస్తున్నప్పటికి టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.అయితే నిర్మాణదారుడు టౌన్ ప్లానింగ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పడం తోనే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అక్రమమని నోటీసులు జారీ... నేడు అంతా సక్రమం

గండిమైసమ్మ లోని హెచ్డిఎఫ్సీ బ్యాంకు పక్కన ఓ నిర్మాణదారుడు కొన్ని నెలల క్రితం ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ సెల్లార్ నిర్మాణం చేపట్టాడు. అయితే అక్రమ నిర్మాణానికి గతం లో విధుల్లో ఉన్న దుండిగల్ టౌన్ ప్లానింగ్ టీపీఎస్ నోటీసులు జారీ చేశాడు. నోటీసులు జారీ చేసి దాదాపు నెల అనంతరం నిర్మాణదారుడు తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించాడు. అయితే నేడు ఆ నిర్మాణం సెల్లార్ తో పాటు అదనపు అంతస్థులతో రూపుదిద్దుకుంటోంది.

అక్రమ నిర్మాణం అని నిర్ధారణ అయ్యిన తర్వాత పనులు ఎలా ప్రారంభం అయ్యాయి. అయితే టీపీఎస్ కు నిర్మాణదారుడి నుండి ముడుపులు భారీగా అందాయని...  సెటిల్మెంట్ అయ్యినందుకే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దుండిగల్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలకు కొదవ లేదు. నోటీసులు జారీ చేసి నెలలు గడుస్తున్న కూడా చర్యలు శూన్యం.అక్రమ నిర్మాణాలపై చర్యలు అంటూ నోటీసులు జారీ చేసి తమ దారికి తెచ్చుకొని లక్షల్లో వసూళ్లు చేస్తూ అక్రమ నిర్మాణాలకు వంత పాడుతున్నారు.

స్పందించని సర్కిల్ డిసి వెంకట మణి కరణ్

అయితే దుండిగల్ సర్కిల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై సర్కిల్ డిసి వెంకట మణి కరణ్ వివరణ కోసం కార్యాలయం లో సంప్రదించగా అందుబాటులో లేరు.ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించక పోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు