ఆదివాసి మార్చును విజయవంతం చేయాలి

12-09-2026 | 06:39pm

అడవి శాఖ అధికారుల అరాచకాలు నుండి  ఆదివాసులను రక్షించాలి

తుడుం దెబ్బ రాష్ట్ర నాయకుల డిమాండ్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఈనెల 16వ తేదీన ఉట్నూర్ ఐటీడీఏకు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసి మార్చ్(Adivasi March)  విజయవంతం చేసేందుకు ప్రతి గూడెం నుండి తరలిరావాలని  తుడుం దెబ్బ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ మై పతి అరుణ్ కుమార్, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు  పుర్కా బాపూరావు  పిలుపునిచ్చారు. శనివారం ఆదివాసులు ఆరాధ్య దైవం  నాగోబా ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆదివాసి మార్చ్ పోస్టర్లను విడుదల చేశారు.

అనంతరం అక్కడి నుండి ఇంద్రవెల్లి మండల(indravelli mandal) కేంద్రంలోని గిరిజన అమరవీరులకు(tribal martyrs) ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  నివాసముండే ఆదివాసి గిరిజనులపై  అడవి శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదిమ తెగకు చెందిన కొలం, తోటి, కోయ  జాతులతో పాటు ఆదివాసులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఆదివాసులు అడవిలోకి వెళ్లకుండా ఆరు అడుగుల లోతులో కందకాలు చదువుతున్నారని, దీంతో వ్యవసాయ చేనులకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పాటు చేస్తున్నారని వారు విమర్శించారు. గతంలో వేసిన విద్యుత్ స్తంభాలను సైతం  అడవి శాఖ అధికారులు తొలగిస్తున్నారని  ఆరోపించారు. సిరికొండ మండలంలో  గతంలో వేసిన విద్యుత్ స్తంభాలను తొలగిస్తున్నారని గుర్తు చేశారు. ఆదివాసి గూడాలకు, వ్యవసాయ పొలాలకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా  కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న మాదిరిగా ఐటీడీఏ లో 29 శాఖలు  పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఐటిడిఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయడంతో పాటు  పోలీస్ కానిస్టేబుల్  నియామకాల్లో  ఆదివాసులకు 75% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ జాబితాలో  చేర్చిన లంబాడాలను తొలగించుటకు  ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం  ఈనెల 16 నిర్వహించే  ఆదివాసి మార్చుకు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరై  విజయవంతం చేయాలని కోరారు. వారితోపాటు  తుడుం దెబ్బ జిల్లా శాఖ అధ్యక్షుడు  పెందుర్తి దాదేరావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్కా చిత్రు, మండల శాఖ అధ్యక్షుడు  మాడవి కోసే రావు, తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు