ఆర్ఎల్సీ ఒప్పందాల అమలులో జాప్యమెందుకు?
- 24 ఒప్పందాలకు సంబంధించిన సర్క్యులర్లు వెంటనే విడుదల చేయాలి
- కేఓసీ పీఓ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా
టేకులపల్లి, (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(Singareni Collieries Workers' Union) (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఆర్ఎల్సీ వద్ద సింగరేణి యాజమాన్యంతో కుదిరిన 24 ఒప్పందాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సింగరేణి కోయగూడెం(Singareni Koyagudem) ఉపరితల గని ప్రాజెక్టు కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మేనేజర్ పేరాల శ్రీనివాస్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచి సహాయ కార్యదర్శి కాంగర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్ఎల్సీ వద్ద కుదిరిన ఒప్పందాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 ఒప్పందాలకు సంబంధించిన సర్క్యులర్లను వెంటనే విడుదల చేయాలని,
డిపెండెంట్లకు తక్షణమే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలని కోరారు. గనులకు అవసరమైన మెటీరియల్‌ను సకాలంలో సరఫరా చేయడంతో పాటు సింగరేణికి రావాల్సిన రూ.60 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న రాజకీయ జోక్యాన్ని తగ్గించి, సింగరేణి స్వతంత్రంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, సామల శ్రీనివాస్, షేక్ సర్వర్, విష్ణువర్ధన్, కరుణశంకర్, బండి సీతారాములు, శ్యామ్ సుందర్, కనకరాజు, కమల్, సాంబశివరావు, వెంకటనర్సయ్య, హరిలాల్, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.