13వ వార్డులో ఘనంగా బతుకమ్మ సంబరాలు
దండు సారయ్య ఆధ్వర్యంలో ఆర్ఆర్ కాలనీలో అంగరంగ వైభవంగా వేడుకలు
ఇల్లెందు టౌన్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు ఆర్ఆర్ కాలనీలో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. స్థానిక కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
కాలనీలో ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. బతుకమ్మ పాటలతో ఆర్ఆర్ కాలనీ మార్మోగింది. మహిళలంతా ఒకచోట చేరి ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తూ సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.