ఇల్లందు ఏరియాలో ఘనంగా ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ సంబరాలు
- గౌరీ పూజతో ప్రారంభం.. మహిళల ఆటపాటలతో సందడి
అధికార ప్రతినిధి సింగరేణి ఇల్లందు ఏరియా
ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా(Singareni Illandu Area) ఆధ్వర్యంలో ఆదివారం జేకే కాలనీలోని బ్లాక్ డైమండ్ స్టేడియంలో ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ వేడుకలను(Saddula Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య(General Manager V. Krishnaiah) ముఖ్య అతిథిగా, సేవా అధ్యక్షురాలు వి. రమ గౌరవ అతిథిగా హాజరయ్యారు. గౌరీ పూజ అనంతరం వేడుకలను ప్రారంభించారు.
సింగరేణి కార్మిక(Singareni worker) కుటుంబాలకు చెందిన మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాల్గొని, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ వైభవాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
అందంగా అలంకరించిన బతుకమ్మలను పరిశీలించి ఎంపిక చేసిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సొలేషన్ బహుమతులను నగదు రూపంలో అందజేశారు. బతుకమ్మల నిమజ్జనం కోసం స్టేడియంలో ప్రత్యేకంగా తాత్కాలిక నీటి కొలనును ఏర్పాటు చేశారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతో వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.