పూల పండుగకు పల్లెలన్నీ పులకింత

18-10-2026 | 10:15pm

చేర్యాలలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు!

చేర్యాల,అక్టోబర్18: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను(Bathukamma Festival) చేర్యాల పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం మహిళలు, ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, రంగురంగుల పూల సోయగాలతో పండుగ ప్రాంగణాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ వలయంగా తిరుగుతూ సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడారు. ఆటపాటలతో పట్టణం, పల్లెలు సందడిగా మారాయి. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువులు, నీటి ప్రదేశాల వద్ద నిమజ్జనం చేసి అమ్మవారికి పూజలు నిర్వహించారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. పల్లెపల్లెలో పూల పరిమళాలు, బతుకమ్మ పాటలు, మహిళల కోలాటాలతో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు