లా కాలేజీ కోసం 15 రోజులుగా దీక్షలు!

25-10-2026 | 06:00pm

భద్రాచలం (విజయ క్రాంతి): భద్రాచలం కేంద్రంగా గిరిజనులకు న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ గోండ్వానా సంక్షేమ పరిషత్(Gondwana Welfare Council) ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 15 రోజులకు చేరుకున్నాయి. భద్రాచలం ఐటీడీఏ ధర్నా చౌక్‌(ITDA Dharna Chowk)లో కొనసాగుతున్న ఈ దీక్షలకు ఉభయ రాష్ట్రాల జీఎస్పీ కన్వీనర్ సొందే వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

ఐటీడీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 83లోని సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతంపై భద్రాచలం సబ్‌కలెక్టర్(Sub-Collector) విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని వీరయ్య డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని, గతంలో పనిచేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

భద్రాచలం పట్టణంలో ఎల్‌టీఆర్ 1/70 చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఈ ప్రాంతంలోని సహజ వనరులను వినియోగించుకుంటున్న ప్రభుత్వం ఆదివాసీల జీవన పరిస్థితులను, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వీరయ్య ఆరోపించారు. భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ చాలాకాలంగా ఉద్యమాలు, రిలే నిరాహార దీక్షలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాయం సన్యాసి, సోడి వెంకటేశ్వర్లు, ముక్తి జనార్దన్ రావు, కల్లూరి కృష్ణ, కొమరం వెంకటేశ్వర్లు, కొమరం భద్రమ్మ, మడకం చిట్టమ్మ, కుంజా సాయమ్మ, వేల్పుల చిట్టమ్మ, సున్నం సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు