కాపర్ కోసం ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసం
- రైతుల మోటార్లు, విద్యుత్ పరికరాలే లక్ష్యంగా చోరీలు
- 15 రోజుల వ్యవధిలో మోటారు అపహరణ
- తాజాగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగల ఎత్తివేత
- రాత్రివేళల్లో దొంగల సంచారం.. గస్తీ పెంచాలని రైతుల విజ్ఞప్తి
బూర్గంపాడు, నవంబర్23, (విజయక్రాంతి): రైతుల(Farmers') పొలాలకు సాగునీరు అందించే విద్యుత్ పరికరాలపై(electrical equipment) దొంగలు కన్నేశారు. విలువైన కాపర్ వైర్(Copper wire) కోసం ట్రాన్స్ఫార్మర్లను(Transformers) సైతం వదలడం లేదు. అందులోని రాగి తీగలను అపహరించేందుకు ట్రాన్స్ఫార్మర్లను(Transformers) ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో వరుసగా చోటుచేసుకుంటున్న చోరీలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వరుస ఘటనలతో కలవరం
ఇరవెండి గ్రామ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా విద్యుత్ పరికరాల చోరీలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 15 రోజుల క్రితం ఓ రైతుకు చెందిన వ్యవసాయ మోటారును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఆ ఘటన మరువకముందే తాజాగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లడం కలకలం రేపుతోంది. ట్రాన్స్ఫార్మర్లను తెరిచి రాగి తీగలను వేరు చేసుకుని తీసుకెళ్తుండటంతో విద్యుత్ పరికరాలు పనికిరాకుండా పోతున్నాయి. చోరీలకు పాల్పడుతున్న వారు ముందస్తు ప్రణాళికతోనే వ్యవసాయ పొలాలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాగుకు ఆటంకం.. రైతులకు అదనపు భారం
వ్యవసాయ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతుండటంతో రైతులకు ఆర్థిక భారం పెరుగుతోంది. ఇప్పటికే పెట్టుబడులు, సాగు ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ పరికరాల చోరీలు మరింత భారంగా మారుతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటమే కాకుండా పంటలకు సకాలంలో నీరు అందించలేని పరిస్థితి నెలకొంటోంది. కొత్త పరికరాల ఏర్పాటు, మరమ్మతుల కోసం అదనపు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పాత ఇనుము దుకాణాలపై నిఘా ఏదీ?
చోరీ చేసిన కాపర్ వైర్లను పాత ఇనుము, లోహాల కొనుగోలు దుకాణాల్లో విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దుకాణాల్లో కొను గోలు చేస్తున్న రాగి తీగల వివరాలు, విక్రయదారుల వివరాలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమానాస్పదంగా రాగి తీగలు విక్రయించేందుకు వచ్చే వ్యక్తులపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రాత్రి గస్తీ పెంచాలి
బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో వ్యవసాయ పొలాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్న ప్రాంతాల్లో రాత్రివేళ పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని రైతులు కోరుతున్నారు. వరుస చోరీలపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని, చోరీకి గురైన మోటార్లు, కాపర్ వైర్లను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ పరికరాల ధ్వంసంతో రైతులకు కలుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.