డైరెక్ట్ ట్రైలరే..!
హీరో నితిన్(Hero Nithiin) నటిస్తున్న తాజాచిత్రం ‘అలియాస్ రుక్మిణి(Alias Rukmini)’. ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్(Muralikant Devasoth) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. దీప్తి గంటా యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. సాధారణంగా సినిమాల ప్రచారంలో భాగంగా ముందుగా టీజర్, ఆ తర్వాత ట్రైలర్‌ను విడుదల చేస్తుంటారు.
అయితే ఈ చిత్రం విషయంలో మాత్రం టీజర్‌ను పక్కనపెట్టి నేరుగా ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. నవంబర్ 26న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించేందుకు చిత్రబృందం రూపొందించిన వీడియో ఆసక్తికరంగా సాగింది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ వీడియో చివరలో హీరో నితిన్, హీరోయిన్ ఆఫియా సయ్యద్, దర్శకుడు మురళీకాంత్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఇక సినిమా విషయానికొస్తే.. నితిన్ ఇందులో కృష్ణ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆఫియా సయ్యద్ రుక్మిణిగా నటిస్తున్నారు.
రుక్మిణి పేరుతో పాపులర్ ప్రేమకథా పుస్తకాలు వెలువడుతుండటం, వాటి వెనుక ఉన్న అసలు రచయిత కృష్ణ కావడం వంటి ఆసక్తికరమైన అంశాలతో కథ సాగనున్నట్లు ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, జోమోన్ టీ జాన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. నవంబర్ 26న విడుదల కానున్న ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుందని చిత్రబృందం ఆశిస్తోంది.