చెడును చంపిన తర్వాత వచ్చే భోగి ఇది
చార్మింగ్ స్టార్ శర్వా(Charming Star Sharwa) తన ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి(Bhogi)’తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలో రిలీజ్ కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. “ఎలాంటి లెక్కలు వేసుకోకుండా మా నిర్మాత నన్ను బలంగా నమ్మారు.
ఆయనకు ఎలాంటి కష్టం వచ్చినా మేమంతా ఆయన వెంట నిలబడతాం. ఇమేజ్‌ను పక్కనపెట్టి, కథను నమ్మి చేసిన సినిమా ఇది. సంపత్ నందికి మాస్ మీటర్ బాగా తెలుసు. ఈ సినిమాతో సంపత్ నంది నాలో కొత్త యాంగిల్‌ను ఇండస్ట్రీకి చూపించారు. ‘భోగి’ గురించి చెప్పాలంటే.. తగ్గినోడికి తగలబెట్టడం కూడా తెలుసు. అనవసరంగా కెలకకండి.. తగలబెట్టి పడేస్తాడు” అన్నారు. డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. “ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే భోగి.
బొగ్గులకుంట గ్రామంలో చాలా కాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాలను మంటలో వేసి కొత్త వెలుగును నింపే క్యారెక్టర్‌లో శర్వానంద్ కనిపిస్తారు. ఈ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడిలా పనిచేశాను. ఈ కథ నేను చెప్పిన ఏకైక హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్. ఆయన ఇండియాలోనే ఉన్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లో ఒకరు. ఈ సినిమాతో శర్వాకి నేషనల్ అవార్డు రావాలి. ఈ సినిమా చూసిన తర్వాత శర్వానంద్ ఫోన్ చేసి, ‘మా అమ్మ నాకు జన్మనిస్తే, మీరు నాకు మరో జన్మనిచ్చారు’ అని చెప్పారు.
ఒక డైరెక్టర్‌కు ఒక హీరో చెప్పే మాటకంటే గొప్ప అవార్డు ఉండదు. ఆ రోజే నేను సక్సెస్ అయిపోయాను. ఇప్పటివరకు శర్వానంద్ బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయనలోని బీస్ట్ చూస్తారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా చేశాడనే దృష్టితో చూడండి.. నచ్చితే పదిమందికి చెప్పండి” అన్నారు. హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ.. “ఇప్పటివరకు నా గ్లామర్ సాంగ్స్, డాన్స్ చూశారు. ఇందులో మాత్రం చాలా వైవిధ్యమైన క్యారెక్టర్. మందారం అనే పాత్ర చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఇది చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్” అని చెప్పింది. నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ.. “ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక క్వాలిటీ సినిమా ఇవ్వాలని ప్రయత్నించాం. మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా” అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, లిరిక్ రైటర్ చంద్రబోస్, కొరియోగ్రాఫర్ భాను మాస్టర్, డీఓపీ కిషోర్ కుమార్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచందర్ నాయక్ కూడా ఈ వేడుకలో మాట్లాడారు. సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.