ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని చదవాలి
- రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పుస్తకాల పంపిణీ
- జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ .
కొత్తగూడెం: టౌన్ నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా చదవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.77వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ(Jai Bhim Rao Bharat Party) ఆధ్వర్యంలో సురక్ష ఓకేషనల్ కళాశాల,గాజులరాజం బస్తీలో భారత రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలుకు ముందు తరతరాలుగా విద్యకు,సంపదకు, అధికారానికి దూరమైన బహుజన వర్గాలకు 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగం ఆమోదంతో విముక్తి కలిగిందని 26 జనవరి 1950 న పూర్తిస్థాయిలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రాథమిక హక్కులు కలిగాయని అన్నిటికంటే ముఖ్యంగా ఓటు హక్కు ప్రధానమైనదని ఓటు హక్కు ద్వారా అణగారిన వర్గాల ప్రజలు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అని,
తద్వారా చట్టసభలలో మనకు అనుకూలంగా చట్టాలను తయారు చేసుకోవచ్చని అన్నారు.ప్రజలకు అత్యున్నతమైన విద్యను,వైద్యాన్ని ఉచితంగా అందించవచ్చని అన్నారు.ఈ దేశంలోని ప్రతీ ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉందని అంతేకాకుండా తెలియని వారికి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని,ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉంటే పాలకులు మనలను పాలిస్తున్న విధానం రాజ్యాంగబద్ధంగా ఉన్నదా? లేదా? అనే విషయాన్ని ప్రజలు గ్రహించవచ్చని,మనకు జరిగే అన్యాయాల పట్ల పోరాడవచ్చని అన్నారు.కనుక అందరూ రాజ్యాంగాన్ని చదవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,వినయ్,వంశీ తదితరులు పాల్గొన్నారు.