సత్యనారాయణ కస్టడీకి గ్రీన్‌సిగ్నల్

26-11-2026 | 10:31am

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) రాగిరి సత్యనారాయణ(Irrigation DEE Satyanarayana)ను విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించినట్లు సమాచారం.

కస్టడీ విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని కోర్టు షరతు విధించింది. మూడు రోజుల విచారణ అనంతరం శనివారం సాయంత్రం తిరిగి న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 12న నాగర్‌కర్నూల్, వనపర్తి ప్రాంతాలతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.7.32 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. వీటిలో విల్లా, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు, బంగారం, వెండి, వాహనాలు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. ఆదాయ వనరులతో పోలిస్తే భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. తాజాగా కస్టడీ విచారణకు అనుమతి లభించడంతో ఆస్తుల సమీకరణ, ఆర్థిక లావాదేవీలు, ఇతర అంశాలపై అధికారులు మరింత లోతుగా ప్రశ్నించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు