ఉరి నాటకం.. హత్య బట్టబయలు

26-11-2026 | 11:23am

ఆదిలాబాద్: ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. కన్నకూతురి ఇష్టాన్ని అంగీకరించలేని తండ్రి, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నార్నూర్ మండలం ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. కుమార్తె కళ్యాణికి మరో యువకుడితో వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు ఈ నెల 25వ తేదీన నిశ్చితార్థం నిర్ణయించారు. అయితే, తాను మేనత్త కుమారుడిని ప్రేమిస్తున్నానని కళ్యాణి తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంట్లో వివాదం మొదలైంది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన తండ్రి కైలాస్, నిద్రిస్తున్న కుమార్తెను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, కుమార్తె మరణించిన కొద్దిసేపటికే అంత్యక్రియలు పూర్తి చేయడం స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. పరువు పోతుందనే భయంతోనే కుమార్తెను హత్య చేసినట్లు తండ్రి అంగీకరించినట్లు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ, పెళ్లి విషయంలో యువతి అభిప్రాయాన్ని గౌరవించకుండా ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు