ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే పునాది: సీఎం రేవంత్
హైదరాబాద్: భారత రాజ్యాంగం(Indian Constitution) దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్టమైన పునాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. రాజ్యాంగం పౌరుల హక్కులను కాపాడటంతో పాటు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి గౌరవం, హక్కులు, అవకాశాలకు భరోసా కల్పిస్తుందని గుర్తుచేశారు.
రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.