జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

25-11-2026 | 05:58pm

మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) డివిజన్‌ అధ్యక్షుడు రంజిత్‌ నాయక్‌ వినతి

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించాలి 

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాసరెడ్డి  హామీ

భద్రాచలం(విజయక్రాంతి): భద్రాచలం డివిజన్‌ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడు భూక్యా రంజిత్‌ నాయక్‌ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. భద్రాచలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు బుధవారం విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy)ని ఆయన ఆధ్వర్యంలోని జర్నలిస్టుల ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయించాలని రంజిత్‌ నాయక్‌ కోరారు. ప్రభుత్వం మంజూరు చేసిన జర్నలిస్టు హెల్త్‌ కార్డులను పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు స్వీకరించకుండా నిరాకరిస్తున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హెల్త్‌ కార్డుల ద్వారా అర్హులైన జర్నలిస్టులకు ముందస్తుగా నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా నగదు రహిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేలా సంబంధిత ఆసుపత్రులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. దీనిపై మంత్రి పొంగులేటి సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా డివిజన్‌ నాయకులు, సభ్యులు వై. దుర్గాప్రసాద్‌రెడ్డి, కాటా సత్యం, బండారు మహేశ్‌, శ్రీశ్రీ, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు