డాక్టర్ నాగేశ్వరరావు సేవలు చిరస్మరణీయం
- గ్రామీణ, గిరిజన ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు
- దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
అశ్వారావుపేట, అక్టోబర్ 8(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు(RMP Doctor Nageswara Rao) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, దశదినకర్మ కార్యక్రమంలో అశ్వారావుపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana ) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ నాగేశ్వరరావు అశ్వారావుపేట ప్రాంతంలో ఆర్ఎంపీ వైద్యులుగా సుదీర్ఘకాలం సేవలందిస్తూ గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పేద, గిరిజన కుటుంబాలకు అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ... డాక్టర్ నాగేశ్వరరావు వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అశ్వారావుపేట పరిసర గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొన్నారని గుర్తుచేశారు.
తాను కూడా పలు సందర్భాల్లో గిరిజన ప్రజలకు సేవ చేస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు డాక్టర్ నాగేశ్వరరావు సూచనలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆయన ఇచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా కొంతమంది బాధితులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు.
ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండటం, పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందించడం ద్వారా డాక్టర్ నాగేశ్వరరావు తన సేవాభావాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన మరణం అశ్వారావుపేట ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఆయన వైద్య సేవలు పొందిన గ్రామీణ, గిరిజన ప్రజలకు తీరని లోటని అన్నారు.
డాక్టర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలియజేశారు. ఆయన అందించిన వైద్య సేవలను కుటుంబ సభ్యులు కూడా కొనసాగిస్తూ ఈ ప్రాంత ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. డాక్టర్ నాగేశ్వరరావు ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు.
అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీర భద్రం తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
అశ్వారావుపేటలోని రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట శాసనసభ్యులు గౌరవ శ్రీ జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ఎంతో కీలకమని అన్నారు. చిన్నారులకు చిన్ననాటి నుంచే సమతుల్యమైన, పౌష్టిక విలువలు కలిగిన ఆహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని పేర్కొన్నారు.
పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఆరోగ్యవంతమైన తల్లి–ఆరోగ్యవంతమైన శిశువు–ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంగా పోషణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. చిరుధాన్యాలు, పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తదితర ఆహార పదార్థాల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను అంగన్‌వాడీ సిబ్బంది వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.