తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో రాస్తారోకో
*రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
ములకలపల్లి,సెప్టెంబర్ 13, (విజయక్రాంతి): మండలంలోని చౌటిగూడెం పంచాయతీ కంపగూడెం(Kampagudem) గ్రామంలో గత నెల రోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.మంచినీటి సమస్యపై గ్రామపంచాయతీ సెక్రెటరీకి,సర్పంచ్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ ఆధ్వర్యంలో కంపగూడెం క్రాస్ రోడ్ వద్ద ఖాళీ బిందెలతో గ్రామస్తులు సుమారు గంటసేపు ధర్నా నిర్వహించి రాకపోకలను స్తంభింపజేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరాటి రమేష్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం మంత్రి సీతక్క రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి ఎద్దడి రాకూడదని గ్రామపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు.
స్థానిక పంచాయతీ సెక్రెటరీ,సర్పంచ్ తాగునీటి సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.ధర్నా విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై మధుప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యపై ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈతో ఫోన్ లో మాట్లాడారు.మంచినీటి సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.ఈ నిరసన కార్యక్రమంలో కంపగూడెం గ్రామస్తులు కన్నయ్య, బక్కులు, ఆదిలక్ష్మి, సుజాత, సబిత, రామకృష్ణ, సున్నం ఈశ్వరి, మహేశ్వరి, మమత, సుజాత,నాగమణి తదితరులు పాల్గొన్నారు.