కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) పరిధిలోని 14వ డివిజన్ (పాత మంచిర్యాల)లో గల అతి పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ రామాలయం – శివాలయం – భక్తాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో దాదాపు రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆది వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాలయం వంటి పవిత్రమైన దేవస్థాన ప్రాంగణంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భక్తులకు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, మార్కెట్ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.