ఇల్లెందులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సోలో డాన్స్ పోటీలు

04-11-2026 | 03:45pm

నవంబర్ 22న భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహణ

ఇల్లెందు టౌన్, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని(Telangana and Andhra Pradesh states) నృత్య కళాకారుల ప్రతిభను(Dance artists' performance) వెలికితీసి వారికి తగిన గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఇల్లందులో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సోలో డాన్స్ పోటీలు నిర్వహించనున్నారు.

పట్టణంలోని 14వ నంబర్ బస్తీలో ఉన్న ఎంఆర్జీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య, ఖమ్మంకు చెందిన విద్యావేత్త డాక్టర్ ఆకుల లక్ష్మి, ఎమ్మార్జి నారాయణ పాఠశాల ప్రిన్సిపాల్ వంగూరి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులకు రాష్ట్రస్థాయి పోటీలు మంచి అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. కళలు, కళాకారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

ఆరు విభాగాల్లో పోటీలు

వెస్ట్రన్ సీనియర్, జూనియర్, ఫోక్ సీనియర్, జూనియర్, క్లాసికల్ సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ బహుమతిగా రూ.5,116, ద్వితీయ బహుమతిగా రూ.3,116, తృతీయ బహుమతిగా రూ.2,116 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్నారు. మొత్తం ఆరు విభాగాల్లో 18 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందించనున్నారు.

పోటీల్లో పాల్గొనే ప్రతి కళాకారుడికి సర్టిఫికెట్, షీల్డ్‌తో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రవేశ రుసుము రూ.500గా నిర్ణయించారు. క్లాసికల్ నృత్యానికి ఐదు నిమిషాలు, వెస్ట్రన్, ఫోక్ నృత్యాలకు నాలుగు నిమిషాల సమయం కేటాయించారు. ప్రతి విభాగంలో కనీసం పది మంది పాల్గొన్నప్పుడే ప్రకటించిన నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.

భద్రాద్రి 24 క్రాఫ్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ మాస్టర్, ఇల్లందు డివిజన్ అధ్యక్షుడు సాయి మాస్టర్, డివిజన్ ఇన్‌చార్జి కంకణాల రాజేష్ ఆధ్వర్యంలో జిల్లా, డివిజన్ కమిటీ సభ్యులు పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నృత్య కళాకారులు, డాన్స్ మాస్టర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

వివరాలకు 8374579497, 9550255636, 9666456781, 9391393695, 9030099139 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు