తప్పు మీద తప్పు.. తప్పించుకునేందుకు తంటాలు!
సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడి కోసం మరో ఉపాధ్యాయుడి పావులు!
ఆగస్టు నుంచి విధులకు దూరం.. అయినా ప్రధానోపాధ్యాయుడిగా ఎలా కొనసాగారు?
తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన ఉపాధ్యాయుల మెడకు ఉచ్చు?
చివరకు పోలీస్ కేసు వరకు వెళ్లిన వ్యవహారం!
ఇల్లెందు, (విజయక్రాంతి): విద్యాశాఖలో(Education Department) ఏం జరుగుతోంది? నిబంధనలు కొందరికి చుట్టాలుగా మారాయా? తప్పిదాలపై తప్పిదాలు జరుగుతున్నా బాధ్యులపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఇల్లందులో(Yellandu) ఓ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయుల(Teachers) వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయుడి తిరిగి విధుల్లో చేరిక వ్యవహారంలో మరో ఉపాధ్యాయుడి సహకారం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆగస్టు నెల నుంచే విధులకు దూరంగా ఉన్న వ్యక్తి తానే ప్రధానోపాధ్యాయుడిగా(Headmaster's) ఎలా కొనసాగినట్లు చూపించుకున్నారు? విధులకు హాజరుకాకుండానే బాధ్యతలు నిర్వహించినట్లు నమోదు చేసుకునే అవకాశం ఎలా కల్పించారు? ఈ వ్యవహారంలో రికార్డులు ఎవరు నిర్వహించారు? ఎవరి ఆదేశాలతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక బాధ్యతలు నిర్వహించిన ఉపాధ్యాయులను సైతం వివాదంలోకి లాగడం మరో విచిత్ర పరిణామం. నిబంధనల ప్రకారం అప్పగించిన బాధ్యతలు నిర్వహించిన ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు.
అసలు తప్పు చేసిన వారిని గుర్తించకుండా, బాధ్యతలు నిర్వహించిన వారిపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఈ వ్యవహారం ఇప్పుడు పోలీస్ కేసు వరకు వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నించారా? రికార్డుల్లో జరిగిన మార్పులకు బాధ్యులెవరు? సస్పెన్షన్ ఎత్తివేత వెనుక అసలు కథేమిటి? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వారిపై చర్యలుంటాయా? లేక తప్పును ప్రశ్నించిన వారినే ఇబ్బందులకు గురిచేస్తారా? విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ ఉపాధ్యాయుల వ్యవహారం.. చివరకు ఎవరిని బాధ్యులను చేస్తుందో వేచి చూడాల్సిందే!