కొడుకులకు డబ్బు విలువ నేర్పిన వీరూ!
లగ్జరీ కార్లు వద్దు.. సొంత కష్టమే ముద్దు: పిల్లల పెంపకంపై వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: కోట్ల రూపాయల ఆస్తులున్న తండ్రి అయినప్పటికీ, తన పిల్లలకు కష్టార్జితం విలువ తెలియజేయడంలో భారత మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) తనదైన శైలిని పాటిస్తున్నారు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ క్రికెట్ ఆడుతూ సొంతంగా సంపాదిస్తున్నారని, ఆర్థిక క్రమశిక్షణను చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటున్నారని వీరూ తెలిపారు. ప్రముఖ డిజిటల్ క్రియేటర్ నేహా బేడీ నిర్వహించిన ‘ది లైఫ్ సేవర్స్ షో’ పాడ్‌కాస్ట్‌లో సెహ్వాగ్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సొంత సంపాదన.. బాధ్యతాయుతమైన అడుగులు
ప్రస్తుతం పెద్ద కుమారుడు ఆర్యవీర్(Virender Sehwag sons Aaryavir Vedant earnings) అండర్-19 స్థాయిలో, చిన్న కుమారుడు వేదాంత్ అండర్-16 స్థాయిలో క్రికెట్ ఆడుతున్నారని సెహ్వాగ్ వెల్లడించారు. ఆట ద్వారా వారు ఇప్పటికే సుమారు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
రూ.7,000 పెట్రోల్ బిల్లు నేర్పిన పాఠం
పిల్లలకు డబ్బు విలువ ఎలా తెలిసివచ్చిందో వివరిస్తూ వీరూ ఒక ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. "ఒకసారి కారుకు రూ.7,000 పెట్రోల్ బిల్లు అయింది. ఆ డబ్బును నా కుమారుడే తన సొంత సంపాదన నుంచి చెల్లించాల్సి వచ్చింది. అప్పటివరకు నేను బిల్లులు కట్టినప్పుడు వారికి దాని తీవ్రత తెలియలేదు. కానీ ఎప్పుడైతే సొంత జేబులోంచి డబ్బులు ఖర్చయ్యాయో, అప్పుడే కష్టపడి సంపాదించిన సొమ్ము విలువ వారికి పూర్తిగా అర్థమైంది" అని సెహ్వాగ్ వివరించారు. ఖరీదైన లగ్జరీ కార్లు, బ్రాండెడ్ వాచ్‌ల వంటి ఆడంబరాల వెంట పడకుండా, మైదానంలో కష్టపడి నిజమైన గౌరవాన్ని సంపాదించుకోవాలని తన పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటానని వీరూ అన్నారు. తన క్రికెట్ రికార్డులతో కుమారులను పోల్చడం సహజమని, అయితే అలాంటి ఒత్తిడికి లోనుకాకుండా కేవలం ఆటపైనే పూర్తి దృష్టి పెట్టాలని వారికి సూచిస్తున్నట్లు సెహ్వాగ్ తెలిపారు. కాగా, పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే దేశవాళీ జూనియర్ క్రికెట్లో తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.