రేవంత్ సర్కార్‌ను కడిగేసిన కేటీఆర్

18-11-2026 | 02:13pm

సాగర్‌లో 90 టీఎంసీల దోపిడీ?.. రేవంత్, ఉత్తమ్‌లపై కేటీఆర్ సంచలన బాంబ్!

హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ, నాగార్జున సాగర్ నీటి(Nagarjuna Sagar Water Dispute) తరలింపు అంశంపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు చారిత్రక ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ ఆరోపించారు.

చరిత్రను గుర్తు చేస్తూ కేటీఆర్ ఆరోపణలు

కృష్ణా నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) గతంలో అన్నట్లు 'చెబితే భారతమంతా.. రాస్తే రామాయణమంతా' అనే మాట అక్షర సత్యమని కేటీఆర్ పేర్కొన్నారు. 1930లో చీఫ్ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ 161 టీఎంసీలతో ఏలేశ్వరం వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తే, ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా నేతలు కుట్రతో దాన్ని నందికొండకు తరలించి మొదటి ద్రోహం చేశారని ఆయన వివరించారు. దీనివల్ల ఆంధ్రాలో 72 శాతం ఆయకట్టు స్థిరీకరణ జరిగితే, తెలంగాణకు కేవలం 28 శాతం మాత్రమే దక్కిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా?

హైదరాబాద్ తాగునీటి పరిస్థితిపై(Drinking water problem) ముఖ్యమంత్రి, మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. ఒకపక్క తాగునీటికి కష్టంగా ఉందని, బండ్లు కడగొద్దని, వారానికోసారి స్నానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే.. మరోపక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మాత్రం హైదరాబాద్‌లో తాగునీటి సమస్యే లేదని అంటున్నారని గుర్తు చేశారు. ఈ తీరు చూస్తుంటే సర్కార్ నడుపుతున్నారా లేక సర్కస్ నడుపుతున్నారా అనే సందేహం కలుగుతోందని విమర్శించారు.

సొరంగం తవ్వి 90 టీఎంసీల తరలింపుపై ఆగ్రహం

నాగార్జున సాగర్‌లో(Nagarjuna Sagar) 510 అడుగుల దిగువన సొరంగం తవ్వి, డెడ్ స్టోరేజీ నుంచి ఏకంగా 90 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కనీసం సోయి లేదా అని కేటీఆర్ నిలదీశారు. నాడు సమైక్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలంలో పోతిరెడ్డిపాడు ద్వారా జలదోపిడీకి సహకరిస్తే, నేడు కూడా అదే తరహాలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లాల ప్రజల సాగునీటి ప్రయోజనాలకు రేవంత్ ప్రభుత్వం శాశ్వత ద్రోహం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. సాగర్ నీళ్లను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, తెలంగాణ ప్రయోజనాల రక్షణ కోసం మరోసారి భారీ పోరాటానికి సిద్ధమవుతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు