నల్లగొండ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణపై బదిలీ వేటు!
నల్లగొండ, నవంబర్ 18 (విజయక్రాంతి) : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో(Nalgonda Municipal Corporation) కీలక పరిణామం చోటుచేసుకుంది. కార్పొరేషన్ కమిషనర్ బి. వంశీకృష్ణపై(Corporation Commissioner B. Vamsi Krishna) ఉన్నతాధికారులు బదిలీ వేటు(Transfer) వేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీజారెడ్డిని(Miryalaguda Municipal Commissioner Srija Reddy) ఇంచార్జ్ కమిషనర్‌గా నియమించారు. ఈ ఆకస్మిక బదిలీ కార్పొరేషన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇటీవల వెలుగులోకి వచ్చిన అక్రమ కారుణ్య నియామకాల వ్యవహారం వంశీకృష్ణ బదిలీకి ప్రధాన కారణంగా ప్రచారం జరుగుతోంది. నకిలీ డెత్ సర్టిఫికెట్ జారీ వ్యవహారంలో కొందరు మున్సిపల్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలతో సరిపెట్టకుండా, మరికొందరిని అన్యాయంగా కేసుల్లో ఇరికించారంటూ కమిషనర్‌పై విమర్శలు వచ్చినట్లు తెలుస్తోంది.
శాఖాపరమైన విచారణతో పరిష్కరించాల్సిన అంశాన్ని క్రిమినల్ కేసుల వరకు తీసుకెళ్లడం, ఈ క్రమంలో కార్పొరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగిందన్న అభిప్రాయాలు ఉన్నతాధికారుల్లో వ్యక్తమైనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే వంశీకృష్ణపై బదిలీ వేటు పడినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ బదిలీ వెనుక అసలు కారణాలేమిటి? కారుణ్య నియామకాల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉంది? నకిలీ డెత్ సర్టిఫికెట్ కేసులో వాస్తవాలేమిటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కమిషనర్ బదిలీతో నల్లగొండ కార్పొరేషన్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ప్రస్తుతం అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.