తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ చీరల పంపిణీ(Indiramma Sarees Distribution)కి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. సిద్ధిపేటలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొని పంపిణీకి అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
ఈ ఏడాది పంపిణీ చేయనున్న చీరలను చిలుకపచ్చ రంగులో సిద్ధం చేసినట్లు సమాచారం. మహిళలకు అందించాల్సిన చీరలను ఇప్పటికే జిల్లాలకు తరలించారు. పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సిద్ధిపేటలో ప్రారంభమైన అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు చీరలు అందించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు పండుగ కానుక అందించడమే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. స్థానిక అధికారుల సమన్వయంతో పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది.