ఫస్ట్ క్రెడిట్ కార్డు.. ఈ తప్పులు చేయొద్దు!
క్రెడిట్ కార్డ్ (Credit Card) తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే దరఖాస్తు చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం అవసరం. సరైన కార్డును ఎంచుకోవడం నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా మొదటిసారి క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్న వారు ఈ ఐదు విషయాలను గుర్తుంచుకోవాలి.
1. మీ ఖర్చులకు సరిపోయే కార్డును ఎంచుకోండి
అన్ని క్రెడిట్ కార్డులు అందరికీ ఉపయోగకరంగా ఉండవు. మీ రోజువారీ ఖర్చులు, అవసరాలను బట్టి కార్డును ఎంచుకోవాలి. కిరాణా సరుకులు, పెట్రోల్, ఫార్మసీలలో UPI ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేసేవారు రూపే క్రెడిట్ కార్డును (RuPay Credit Card) పరిశీలించవచ్చు. అర్హత కలిగిన కార్డులను యూపీఐ యాప్‌లకు అనుసంధానించి, మద్దతు ఉన్న వ్యాపార సంస్థల్లో చెల్లింపులు చేయవచ్చు. ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేసేవారు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు అందించే కార్డులను ఎంచుకోవడం మంచిది.
2. దరఖాస్తుకు ముందే ఛార్జీలు, నిబంధనలు తెలుసుకోండి
క్రెడిట్ కార్డులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన ఛార్జీలను విస్మరించకూడదు. వార్షిక రుసుము, ఆలస్య చెల్లింపు ఛార్జీలు, నగదు ఉపసంహరణ రుసుములు, వడ్డీ రేట్లను ముందుగానే పరిశీలించాలి. బ్యాంకులు అందించే కీలక నిబంధనల పత్రాన్ని (Key Fact Statement) జాగ్రత్తగా చదవాలి.
ముఖ్యంగా కనీస బకాయి (Minimum Due) మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని భావించకూడదు. కనీస మొత్తం చెల్లించడం వల్ల ఆలస్య రుసుము తప్పించుకోవచ్చు కానీ మిగిలిన బకాయిపై వడ్డీ పడుతూనే ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు ద్వారా నగదు తీసుకుంటే ఉపసంహరణ తేదీ నుంచే వడ్డీ వర్తించే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి నెలా గడువు తేదీలోగా పూర్తి బిల్లును చెల్లించడం ఉత్తమం.
3. ఒకేసారి ఎక్కువ కార్డులకు దరఖాస్తు చేయవద్దు
మొదటి క్రెడిట్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే అనేక బ్యాంకులకు దరఖాస్తు చేయడం సరైన పద్ధతి కాదు. ప్రతి దరఖాస్తు మీ క్రెడిట్ నివేదికపై విచారణకు దారితీయవచ్చు. తక్కువ వ్యవధిలో ఎక్కువ దరఖాస్తులు చేయడం మీ క్రెడిట్ స్కోర్ (Credit Score)పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాబట్టి దరఖాస్తు చేయడానికి ముందు బ్యాంకు అర్హత ప్రమాణాలు, కనీస ఆదాయం, ఉద్యోగ స్థితి వంటి వివరాలను తెలుసుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితికి సరిపోయే ఒక కార్డును ఎంచుకుని దరఖాస్తు చేయడం మంచిది.
4. ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఉందని అధికంగా ఖర్చు చేయకండి
బ్యాంకు రూ.50,000 క్రెడిట్ లిమిట్ ఇచ్చిందని ప్రతి నెలా అంత మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. క్రెడిట్ పరిమితి (Credit Limit) అనేది ఖర్చు చేసేందుకు అందుబాటులో ఉన్న గరిష్ఠ మొత్తం మాత్రమే.. అది మీ ఆదాయం కాదు.ఉదాహరణకు, మీ క్రెడిట్ పరిమితి రూ.50,000 ఉంటే, బకాయిని రూ.15,000 లోపు ఉంచుకోవడం ద్వారా క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30 శాతం కంటే తక్కువగా నిర్వహించవచ్చు. తక్కువ క్రెడిట్ వినియోగం, సకాలంలో బిల్లుల చెల్లింపు మీ క్రెడిట్ ప్రొఫైల్‌కు మేలు చేస్తాయి. బిల్లుల చెల్లింపులు మర్చిపోకుండా ఉండేందుకు బ్యాంకు ఖాతాలో తగినంత నగదు ఉన్నప్పుడు ఆటో డెబిట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.
5. క్రెడిట్ హిస్టరీ లేకపోతే FD ఆధారిత కార్డు తీసుకోవచ్చు
క్రెడిట్ చరిత్ర (Credit History) లేని వారికి సాధారణ క్రెడిట్ కార్డు పొందడం కొంత కష్టంగా ఉండవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, గిగ్ వర్కర్లు, గృహిణులు, చిన్న వ్యాపారులు ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.ఇలాంటి వారికి ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారిత క్రెడిట్ కార్డు (FD Backed Credit Card) ఉపయోగపడుతుంది. ఈ విధానంలో ముందుగా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్‌ను భద్రతగా తీసుకుని బ్యాంకు క్రెడిట్ కార్డును జారీ చేస్తుంది. కార్డు పరిమితి సాధారణంగా ఎఫ్డీ మొత్తానికి అనుసంధానమై ఉంటుంది.
ఈ విధానంలో కొన్ని బ్యాంకులు సాధారణ ఆదాయ ధ్రువీకరణ లేదా గత క్రెడిట్ స్కోర్ లేకుండానే కార్డును అందించవచ్చు. అయితే అర్హత నిబంధనలు బ్యాంకును బట్టి మారుతాయి. మరోవైపు, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ కూడా కొనసాగుతుంది. కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించి, బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా క్రమంగా క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు.
గుర్తుంచుకోండి: క్రెడిట్ కార్డు అనేది అదనపు ఆదాయం కాదు.. బాధ్యతతో ఉపయోగించాల్సిన రుణ సదుపాయం. సరైన కార్డును ఎంచుకుని, అవసరానికి మించి ఖర్చు చేయకుండా, ప్రతి నెలా పూర్తి బిల్లును సకాలంలో చెల్లిస్తే మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించుకోవచ్చు.