వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?

24-11-2026 | 05:30am

చిన్న నిర్లక్ష్యం.. పెద్ద సైబర్ ముప్పుగా మారొచ్చు

పబ్లిక్ కంప్యూటర్లలో వాడే వారు తస్మాత్ జాగ్రత్త

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆఫీస్, సైబర్ కేఫ్(Cyber ​​Cafe), పబ్లిక్ ఇంటర్నెట్ సెంటర్లు(Public Internet Centers), హోటల్ బిజినెస్ సెంటర్లు(Hotel Business Centers), ఇతరుల ల్యాప్‌టాప్‌లలో(Laptop) వాట్సాప్ వెబ్‌ను(WhatsApp Web) ఉపయోగిస్తున్నారా? పని పూర్తయ్యాక వాట్సాప్ లాగ్‌అవుట్ చేయకుండానే బ్రౌజర్ ట్యాబ్(Browser tab) లేదా విండోను క్లోజ్ చేసి వెళ్లిపోతున్నారా? మీరు చేసే చిన్న పొరపాటు మిమ్మల్ని సైబర్ నేరగాళ్ల(Cybercriminals) ఉచ్చులో పడేసే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా లాగ్‌అవుట్ కావాలని, లేకుంటే మీ వ్యక్తిగత సందేశాలు, కాంటాక్టులు, గ్రూప్ చాట్‌లు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా(Central Government's Cyber ​​Security) విభాగం హెచ్చరించింది.

మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో చేసిన ప్రైవేట్ సంభాషణలను ఇతరులు చదివే అవకాశం ఉంది. మీ పరిచయస్తుల వివరాలను తెలుసుకొని మోసాలకు పాల్పడొచ్చు. మీరు సభ్యులుగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లోని సందేశాలు ఇతరులు చూసే ప్రమాదం ఉంది. మీ వాట్సాప్ ఖాతా నుంచే ఇతరులకు సందేశాలు పంపుతూ, అత్యవసర పరిస్థితి ఉందంటూ డబ్బులు అడగడం, నకిలీ లింకులు పంపడం, మోసాలకు పాల్పడటం వంటి ప్రమాదాలు ఉన్నాయి. 

ప్రైవేట్ బ్రౌజింగ్ ఉపయోగించాలి

చాలా మంది మొబైల్‌లోని వాట్సాప్ ఖాతాను కంప్యూటర్‌కు లింక్ చేసుకుని వాట్సాప్ వెబ్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు కంప్యూటర్ల ద్వారా మెసేజ్‌లు పంపడం, ఫైల్స్ షేర్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. అయితే.. ఈ సౌకర్యమే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది. వాట్సాప్ వెబ్‌లో ప్రైవేట్ లేదా ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్‌ను ఉపయోగించాలి. దాన్ని కూడా పని పూర్తయిన తర్వాత లాగ్ అవుట్ కావడం తప్పనిసరి.

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం, సంస్థల రహస్య వివరాలు, ఆర్థిక సమాచారం, గోప్యమైన డాక్యుమెంట్లు వంటి వాటిని కంప్యూటర్లలోని వాట్సాప్ వెబ్ సెషన్ల ద్వారా షేర్ చేయకుండా ఉండటమే బెస్ట్. మీరు పంపని మెసేజ్‌లు మీ ఖాతా నుంచి వెళ్తున్నా, మీ కాంటాక్టులు మీకు తెలియని సందేశాల గురించి చెబుతున్నా.. మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ డివైస్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ మీ ఖాతాకు లింక్ అయి ఉన్న పరికరాలను పరిశీలించి.. మీకు తెలియని లేదా అనుమానాస్పద పరికరం కనిపిస్తే లాగ్‌అవుట్ చేయాలి. 

మరిన్ని వార్తలు