రాహుల్ అరాచకం నహీ చలేగా

24-11-2026 | 05:50am

రాజ్యాంగం ఆయనకు జేబులో ఉంటే.. మాకు గుండెల్లో ఉంది!

చొరబాటుదారులకు ఓటు కోసమే ఇండీ కూటమి యాగీ

విదేశీ టూల్ కిట్‌కు ప్రజలే బుద్ధి చెప్తారు: నితిన్ నబీన్

  1. రాహుల్ ధ్యాసంతా దేశంమీద కాదు.. కుటుంబ అభివృద్ధి మీదనే 
  2.    3 కోట్ల మంది చనిపోయారు, 6 కోట్లకుపైగా ఓటర్లు వలస వెళ్లారు.. వాళ్ల పేర్లు ఓటర్ లిస్టులో ఉండాల్నా? 
  3. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజలంటే పట్టదు.. హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకోవడంపైనే దృష్టి 
  4. ఒక అవినీతి ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు దించేస్తే అంతకన్నా పెద్ద అవినీతి సర్కార్ వచ్చింది 
  5. త్వరలోనే కాంగ్రెస్ సర్కార్‌నూ సాగనంపుతారు 
  6. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తాం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు 
  7. కరీంనగర్‌లో బీజేపీ మహాపాదయాత్రకు హాజరు 
  8. రాహుల్ పప్పూ.. ఇక నీ పప్పులు ఉడకవ్: కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  9. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

కరీంనగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఇండీ కూటమి నేతలు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని.. వారికి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. ‘కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీకి దేశమంటే పట్టదు.. ఇక్కడి ప్రజలంటే పట్టదు.. ఆయన ధ్యాసంతా కుటుంబం కోసం, కుటుంబ అభివృద్ధి కోసమే. విదేశాలకు వెళ్లి మన దేశం పరువు తీస్తాడు. అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడుతాడు. ఆ విదేశీ టూల్ కిట్‌కు ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’ అని హెచ్చరించారు.

రాహుల్ గాంధీ జేబులో రాజ్యాంగాన్ని పెట్టుకొని తిరుగుతుంటారని.. కానీ, తమకు మాత్రం అది హృదయంలో ఉంటుందని.. రాజ్యాంగాన్ని రక్షించేది, ప్రజాస్వామ్యాన్ని కాపాడేది బీజేపీ మాత్రమేనని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమర్జెన్సీ చరిత్ర కాంగ్రెస్‌ది అని నితిన్ నబీన్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ పోరాటమంతా చొరబాటుదారులకు ఓటు హక్కు కోసమేనని.. చొరబాటుదారులకు ఈ దేశంలో తావులేదని తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 36 నెలల్లో రేవంత్‌రెడ్డి 82 సార్లకుపైగా ఢిల్లీ దర్బార్‌కు వెళ్లి అధిష్ఠానానికి మోకరిల్లారని.. ఆయనకు తెలంగాణ ప్రజల మీద ధ్యాస లేదని, అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడంపైనే ధ్యాసంతా అని నితిన్ నబీన్ విమర్శించారు. సోమవారం కరీంనగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట మహాపాదయాత్ర జరిగింది. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ చౌక్ నుంచి కమాన్ సెంటర్ వరకు పాదయాత్ర కొనసాగింది. అనంతరం సభలో నబీన్ ప్రసంగించారు. 

రాహుల్ కలల్లోనే జీవిస్తాడు.. 

ఇండీ కూటమి నేతలు అరాచకత్వాన్ని నమ్ముకున్నారని, తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని నితిన్ నబీన్ అన్నారు. ‘రాహుల్ ఓటు చోరీ అంటున్నాడు.. కానీ ప్రజలు, ప్రజల ఓట్లు మా పక్షాన ఉన్నాయి. ఆయన కలల్లోనే జీవిస్తాడు’ అని వ్యాఖ్యానించారు. సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఇండీ కూటమి నేతలు నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. ‘రాహుల్ బాబా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని, జేబులో పెట్టుకొని తిరుగుతుంటాడు.. వాళ్లకు మనసులో రాజ్యాంగం లేదు. రాజ్యాంగం మా మనస్సులో, హృదయంలో ఉంది’ అని ఆయన తెలిపారు.  ‘దేశంలో 13 కోట్ల మంది ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ సహా ఇండీ కూటమి నేతలు అంటున్నారు. అందులో 3 కోట్ల మంది చనిపోయారు.. వాళ్ల ఓట్లు ఓటర్ లిస్టులో ఉండాలా? 6 కోట్లకుపైగా ఓటర్లు వలస వెళ్లారు.. తెలంగాణలో కూడా అలాంటి వాళ్లు ఉన్నారు.. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండాల్నా.. 3 కోట్లకుపైగా ఓటర్ల అడ్రసు లేదు.. చొరబాటుదారులకు ఓటు కోసమే రాహుల్, ఇండీ కూటమి నేతల తాపత్రయం’ అని చెప్పారు.  

వాళ్లా మాట్లాడేది?

‘ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని విధించింది.. తమ కుటుంబం, పదవి కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. అలాంటి వాళ్లా మాట్లాడేది?

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తూనే ఉన్నడు. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తూనే ఉన్నడు. భారత ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నడు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. దేశం అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం నిరాశలో కూరుకుపోతారు. దేశ విజయాలను గుర్తించడానికి వారికి మనసొప్పదు. ఇండీ కూటమి నేతలకు ప్రజలతో సమాధానం చెప్పించాలనే మేం ముందుకు వచ్చాం’ అని  నితిన్ నబీన్ పేర్కొన్నారు. కరీంనగర్, తెలంగాణ ప్రజల మధ్య రాహుల్ గాంధీ  నిజస్వరూపాన్ని బయటపెట్టడానికే వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ నేతలకు దేశం లేదా కరీంనగర్ అభివృద్ధిపై చింత లేదనన, కేవలం వారి సొంత, కుటుంబ, పార్టీ అభివృద్ధిపైనే ధ్యాస ఉందని మండిపడ్డారు. 

రాహుల్‌కు ఏటీఎంలా రేవంత్

తెలంగాణలో 36 నెలల పాలన పూర్తికాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 82 సార్లకు పైగా ఢిల్లీ దర్బార్‌కు వెళ్లి అధిష్ఠానానికి మోకరిల్లారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విమర్శించారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం కంటే ఎక్కువగా ఢిల్లీ బాస్‌ల ఆశీర్వాదం కోసమే రేవంత్ ఎక్కువగా ప్రదక్షిణలు చేస్తున్నారని.. ఆయనకు తెలంగాణ ప్రజల మీద ధ్యాసలేదని.. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడం మీదే దృష్టి ఉందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలకు ఏటీఎంలా సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ  ప్రజల చెమట, శ్రమను దోచి ఢిల్లీ బాస్ల్‌కు ఏటీఎంలను నింపే పనిలో రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆ ప్రభుత్వానికి ఏ శిక్ష విధించాలో ఇక్కడి ప్రజలే త్వరలో నిర్ణయిస్తారని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్

రాష్ట్రంలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు గద్దె దించితే అంతకంటే పెద్ద అవినీతి ప్రభుత్వం కాంగ్రెస్ రూపంలో కొలువుదీరిందని.. త్వరలోనే ఆ ప్రభుత్వం దిగిపోకతప్పదని నితిన్ నబీన్ అన్నారు. బీజేపీతోనే అవినీతి రహిత పాలన, తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రానున్న రోజుల్లో బీజేపీ కార్యకర్తలు ఈ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తారు. రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఖాయం’ అని పేర్కొన్నారు. 

వాళ్లకు యువరాజు మాత్రమే తెలుసు

కాంగ్రెస్‌కు యువరాజు మాత్రమే తెలుసు. ప్రజలకు సేవ చేయడం తెలియదని నితిన్ నబీన్ అన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లరని, 2029లో మళ్లీ ఆయనే ప్రధాని అవుతారని, లాల్ ఖిల్లా నుంచి జాతీయ జెండా ఎగరేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశం మరో సంకల్పం తీసుకుందని, అది ‘నషా ముక్త్ భారత్’ అని, దీనికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 

బండి సంజయ్‌కి అభినందనలు

కరీంనగర్‌లో ప్రతి ఇంటికి సొంత బిడ్డలా అండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలిచారని, ఆయనకు అభినందనలు తెలుపుతున్నానని నితిన్ నబీన్ అన్నారు. బండి సంజయ్ పనితీరును తాను గతంలోనూ చూశానని.. ఆయన, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సమర్థవంతమైన నాయకత్వం, కార్యకర్తల కృషి వల్లే కరీంనగర్ పాదయాత్రకు భారీగా జనం తరలివచ్చారని అభినందించారు.

మహా పాదయాత్రకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు పేరుపేరునా ప్రణామాలు తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఇండీ కూటమి నేతలు తమ సర్వశక్తులూ ఒడ్డినా ఒక్క రామ్‌లీలా మైదానాన్ని కూడా నింపలేకపోయారని.. కానీ బీజేపీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా 200కుపైగా ప్రాంతాల్లో రామ్‌లీలా మైదానానికి పదిరెట్ల జనాన్ని సమీకరించి సత్తా చాటారని, ఇప్పుడు కరీంనగర్‌లో కూడా సత్తా చాటారని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు