ప్రైవేటు ‘మార్క్’!
ప్రాక్టికల్స్‌కు హాజరైతే చాలు 20, పేరున్న కళాశాలకు మరో 10
- ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యం
- ఇన్విజిలేటర్లు సైతం వారికే అనుకూలం
- ప్రతిభ నిల్.. మార్కులు ఫుల్!
- అటకెక్కిన జంబ్లింగ్ విధానం ప్రతిపాదనలు
- ఈసారి నుంచి ఇంటర్ ఫస్టియర్‌కూ ప్రాక్టికల్స్
నవంబర్ 23 (విజయక్రాంతి): ఇంటర్మీడియట్(Intermediate) అంటేనే మార్కుల వేటగా మారింది. విద్యార్థి ప్రతిభతో(Student Talent) సంబంధం లేకుండా పలు ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ప్రాక్టికల్స్‌లో(Private and corporate colleges practicals) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థికి పరిశోధనాత్మక విజ్ఞానం(Research-based knowledge) ఉందా? లేదా? అనేది ఆలోచన చేయడం లేదు. 30కి 30 మార్కులు వేస్తున్నారు. ఇలా మార్కులు వేయడంపై ఎన్నో ఆరోపణలు, అనుమానాలున్నాయి.
ఈ మార్కుల మాయాజాలానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం(Jumbling system) తేవాలని గతంలో అనుకున్నారు. కానీ ఆ ప్రతిపాదన ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమవుతున్నది. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వ హయాం నుంచి ఈ అంశంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏడాది పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానం అంటున్నారే తప్ప అమలుకు నోచుకోవడం లేదు.
మార్కులే ప్రామాణికం..
ఇప్పుడు చదివిన దానికంటే, వేసిన మార్కులే భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. విద్యార్థికి సబ్జెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉందో కాదు. ముఖ్యంగా ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ పేరుతో జరుగుతున్న మార్కుల మాయ విద్యా వ్యవస్థకే పెద్ద మచ్చగా మారింది. ఇష్టారాజ్యంగా మార్కులు వేయడం, అడ్మిషన్ల కోసం మార్కులను ఎరగా చూపడం, ర్యాంకులొచ్చాయని ఊదరగొట్టడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. వార్షిక పరీక్షలను ఇప్పటికే జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తున్నారు.
అదే తరహాలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కూడా జంబ్లింగ్ విధానంలో నిర్వహిస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకూ చెప్తూనే ఉన్నారు. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు. ఫలితంగా కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో తమ ఇష్టానుసారంగా 30 కి 30 అత్యధికంగా మార్కులు కేటాయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కొన్ని కాలేజీలైతే ప్రాక్టికల్ పరీక్షకు అటెండ్ అయితే చాలు 20కి పైగానే మార్కులు వేస్తున్నాయనే చర్చ జరుగుతున్నది. కొన్ని కాలేజీలేమో ప్రాక్టికల్స్ తరగతులను మమ అనిపిస్తూ.. నేరుగా పరీక్షలకే వెళ్తున్నాయి.
ప్రాక్టికల్స్ పేరుతో ప్రత్యేక ఫీజులు..
ఈవిద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ ప్రవేశపెట్టారు. ఉద్దేశం మంచిదే. మొదటి సంవత్సరం నుంచే ప్రయోగాత్మక విద్యపై పట్టు పెరగాలని, కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదని అధికారుల ఆలోచన. కానీ ఆచరణలో ఏం జరుగుతోంది? ప్రాక్టికల్ పరీక్ష అంటే ఇప్పుడు కాలేజీ యాజమాన్యం చేతిలో ఉన్న ఒక ఆయుధం. విద్యార్థి ప్రతిభను కొలిచే సాధనం కాదు, కాలేజీకి అడ్మిషన్లు తెచ్చిపెట్టే మార్కెటింగ్ సాధనం. ఒక విద్యార్థి ప్రాక్టికల్‌లో నిజంగా ఎంత బాగా చేశాడో, ఎంత నేర్చుకున్నాడో చూడకుండా, అతడు ఏ కాలేజీలో ఉన్నాడో, ఆ కాలేజీ యాజమాన్యం ఎంత బలంగా ఉందో అనే దాన్ని బట్టి మార్కులు పడుతున్నాయి.
ఒకే విద్యార్థి ఒక కాలేజీలో ఉంటే 28 మార్కులు, మరో కాలేజీలో ఉంటే 20 మార్కులు. థియరీలో పెద్దగా మార్కులు తెచ్చుకోలేని విద్యార్థికి ప్రాక్టికల్స్‌లో 30కి 30 మార్కులు ఎలా వస్తాయి? ఈ ప్రశ్నకు ఇంటర్ బోర్డు దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే బోర్డు ఎప్పుడూ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోలేదనే ఆరోపణలున్నాయి. పైగా కొన్ని కాలేజీలు ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల నుంచి ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి వేల రూపాల్లో వసూళ్లకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
ప్రైవేట్ కాలేజీలకు ఇన్విజిలేటర్లు కూడా సహకరిస్తున్నారనే అనుమానాలున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలంటే పరీక్షా కేంద్రాలు, ఎగ్జామినర్ల కేటాయింపుల్లో జంబ్లింగ్ విధానం తప్పనిసరి అమలు చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరగనున్నాయి.
ఈ సారి ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల నుంచి సుమారుగా 5.50 లక్షల నుంచి ఆరు లక్షల వరకు విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరు కానున్నారు. విద్యార్థి చదువుతున్న కాలేజీలో కాకుండా, వేరే కాలేజీలో ప్రాక్టికల్ నిర్వహించడం, వేరే కాలేజీ లెక్చరర్ మార్కులు వేయడం, థియరీ పరీక్షల్లో ఎలాగైతే జంబ్లింగ్ ఉంటుందో, ప్రాక్టికల్స్‌లో కూడా అలాగే ఉండాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.