పోలీసుల వలలో గంజాయి వ్యసనపరులు
గంజాయి, విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు
చందుర్తి సి,ఐ కె. రవీందర్
చందుర్తి,నవంబర్ 01,(విజయక్రాంతి): చందుర్తి సర్కిల్ పరిధిలోని చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో గంజాయి(Ganja Trafficking) రవాణా, విక్రయాలు మరియు వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు గత మూడు రోజుల క్రితమే చందుర్తి సీఐ కె. రవీందర్ తెలిపారు. ఇదే క్రమంలో శుక్రవారం రోజు నిర్వహించిన తనిఖీలలో ముగ్గురు వ్యసనపరులను పట్టుకొని, వారిని రిమాండ్ కు తరలించడం జరుగుతోందని తెలిపారు. గంజాయి అక్రమ దందాకు స్వస్తి చెప్పేందుకు ఒకవైపు విస్తృత తనిఖీలు చేపడుతూనే, మరోవైపు గంజాయి వ్యసనపరులను సాంకేతికంగా పట్టుకోవడానికి యూరిన్ టెస్ట్ కిట్లను వినియోగిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.
ఇందులో భాగంగా శుక్రవారం సనుగుల గ్రామ శివారులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కన్పించడంతో వారికి యూరిన్ టెస్ట్ కిట్ల ద్వారా ప్రాథమిక పరీక్షలో గంజాయి ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించి, వారు గంజాయి సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించి, అదుపులోకి తీసుకుని తదుపరి చర్యల నిమిత్తం రిమాండ్ తరలించడం జరుగుతోందని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన చందుర్తి ఎస్సై రమేష్‌ను మరియు స్టేషన్ సిబ్బందిని సీఐ రవీందర్ అభినందించారు. గంజాయిని విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా లేదా సేవించినా చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.యువత గంజాయి వంటి మహమ్మారికి దూరంగా ఉండి తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.