ఎండలు మండినా.. బొప్పాయి పండింది!

01-11-2026 | 05:35am
  1. ఎల్ నినోకు ఎదురీదిన రైతు
  2. రెండెకరాల్లో బొప్పాయి సాగు
  3. నీటి పొదుపు, ఆధునిక పద్ధతులతో అద్భుత ఫలితం
  4. 50 టన్నుల దిగుబడి
  5. పెట్టుబడి పోను రూ.2.10 లక్షల ఆదాయం 
  6. తోటి రైతులకు ఆదర్శం చింత్రియాల రైతు గాలే సాహెబ్ 
  7. (నట్టె కోటేశ్వర్‌రావు, విజయక్రాంతి, నల్లగొండ బ్యూరో)

ఒక వైపు భానుడి భగభగలు.. మరోవైపు వర్షాభావ పరిస్థితులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వెరసి సాగునీటి తంటాలు! ఎల్ నినో ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారినా, వర్షాభావ పరిస్థితులు వెంటాడినా ఆ రైతు అధైర్యపడలేదు. ఎవుసం తప్ప మరేమీ తెలియని ఆ అన్నదాత.. సంప్రదాయ పంటల మూస పద్ధతికి స్వస్తి పలికాడు. ఆధునిక ఆలోచనలు, పంట మార్పిడి విధానంతో తక్కువ నీటితోనే ఎక్కువ లాభాలు అర్జించవచ్చని నిరూపించాడు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింత్రియాల గ్రామానికి చెందిన రైతు షేక్ గాలే సాహెబ్.. బొప్పాయి సాగు(Papaya Cultivation)తో తోటి రైతులకు ఆదర్శంగా నిలిచాడు. 

రెండెకరాలు, రూ.90 వేల పెట్టుబడి

గాలే సాహెబ్ తనకున్న రెండెకరాల భూమిలో బొప్పాయి సాగు చేశాడు. ల్ నినో పరిస్థితులు, నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని బిందు సేద్యం ఎంచుకున్నాడు. మొక్కల మొదళ్ల వద్దకే నేరుగా నీరు అందేలా డ్రిప్ ఏర్పాటు చేశాడు. దీంతో నీటి వృథా తగ్గడంతో పాటు పంటకు అవసరమైన తేమ అందింది. దీనికి తోడు చీడ, పీడలు మొక్కల దరి చేరకుండా మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు వాటి ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించారు.

మొక్కలు తెచ్చింది మొదలుకొని వాటిని నాటడం, పోషణ, నీటి సరఫరా తదితర యాజమాన్య పద్ధతులకు గాను రెండు ఎకరాలకు రూ.90 వేలు ఖర్చు చేశారు. ఎకరాకు 25 టన్నుల చొప్పున రెండెకరాలకు 50 టన్నుల దిగుబడి సాధించాడు. వాటిని విక్రయించడం ద్వారా మొత్తం రూ.3 లక్షల స్థూల ఆదాయం పొందాడు. పెట్టుబడి, ఇతర సాగు ఖర్చులు పోను రూ.2.10 లక్షల నికర లాభం వచ్చినట్లు రైతు తెలిపారు. సంప్రదాయ సాగుకు బదులుగా బొప్పాయి తనకు కలిసొచ్చిందని, ఎండలు మండినా మంచి ఆదాయం తెచ్చిపెట్టిందన్నారు.

బిందు సేద్యంతో నీటి ఆదా 

నీటి కొరత ఉన్న ప్రస్తుత సమయంలో బిందు సేద్యం ద్వారా బొప్పాయి తోటకు నీరందించి మంచి ఫలితాలు సాధించారు.. రైతు గాలే సాహెబ్. మొక్కలకు అవసరమైన నీటిని వేర్ల వద్దకే డ్రిప్ ద్వారా అందించడంతో నీటి వినియోగం తగ్గింది. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సూక్ష్మసేద్య పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఆధునిక పద్ధతులు అవలంభించడం వల్ల పెట్టుబడి భారం తగ్గించగలిగారు.   

నీటి వసతిని చూసి పంట ఎంచుకున్నా

నాకున్న రెండు ఎకరాల్లో వసతికి అనుగుణంగా పంట వేయాలని ఆలోచించా. బొప్పాయిపై దృష్టి మళ్లింది. వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి బొప్పాయి సాగు వివరాలు తెలుసుకున్న. వారి సూచన మేరకు నీటిని పొదుపుగా వాడేందుకు డ్రిప్ ఏర్పాటు చేశా. మంచి ఫలితం దక్కింది. ఉద్యాన శాఖ అధికారుల సహకారం మరువలేనిది. రైతులు నీటి వసతిని బట్టి పంటలను ఎంచుకోవడం మంచిది. 

గాలే సాహెబ్, రైతు,

చింత్రియాల, సూర్యాపేట జిల్లా

మరిన్ని వార్తలు