ఇంటర్ విలీనం పెద్ద పరీక్షే!

24-11-2026 | 05:00am

జుర్రు నారాయణయాదవ్:

రాష్ట్రంలో విద్యావ్యవస్థ(Education System) ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ఇంటర్‌బోర్డును(Inter Board) పాఠశాల విద్యా శాఖలో(Department of School Education) విలీనం చేయాలని తీసుకున్న నిర్ణ యం చర్చకు దారితీసింది. ఇది కేవలం రెండు శాఖలను కలపడం కాదు. పాఠశా ల నుంచి ఉన్నత విద్యలోకి ప్రవేశించే కీలక దశ అయిన ఇంటర్ స్వరూపాన్ని మార్చే నిర్ణయం. దీని వెనుక పరిపాలనా సంస్కరణలు, జాతీయ విద్యా విధానం -2020, విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి తగ్గించడం, డ్రాపౌట్ల నియంత్రణ, పాఠ్యాంశాల్లో సమన్వయం, విద్యావనరుల సమర్థ వినియోగం వంటి లక్ష్యాలున్నట్లు భావించవచ్చు. అయితే ఏ సంస్కరణైనా దాని లక్ష్యాలు కాకుండా, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేదాన్ని బట్టి సక్సెస్ అవుతుంది.

జాతీయ విధానాన్ని బట్టి.. 

ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న 10+2 విద్యావిధానానికి బదులుగా జాతీయ విద్యా విధానం-2020లో 5+3+3+4 విద్యా నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందులో చివరి నాలుగేండ్లు 9 నుంచి 12 తరగతుల వరకు ఒకే విద్యా దశగా పరిగణిస్తారు. విద్యార్థుల వయస్సు, మానసిక వికాసం, అభ్యసన సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యప్రణాళికను రూపొందించడం, విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ విధానం ఉద్దేశం.

దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాల విద్యాశాఖ పరిధిలోనే హయ్యర్ సెకండరీ విద్య కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పాఠశాలల ద్వారానే ఇంటర్ స్థాయి విద్య అందిస్తున్నారు. సీబీఎస్‌ఈలో కూడా 9 నుంచి 12 తరగతుల వరకు ఒకే విద్యా వ్యవస్థగా నిర్వహిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి, తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయడం అవసరం.

నాణ్యమైన విద్య అందాలి..

ఇంటర్‌ను పాఠశాల విద్యా పరిధిలోకి తీసుకురావడం వల్ల ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌కు మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, హాస్టల్ వసతి, ప్రైవేట్ కళాశాలల ఫీజులు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా బాలికల చదువులకు దూరం, రవాణా సౌకర్యాల లేమి ప్రతిబంధకంగా ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంటర్ అందిస్తే విద్యార్థులకు సమీప ప్రాంతాల్లోనే చదువుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా చదువులు మానేసే పరిస్థితులు తగ్గవచ్చు.  

ఉద్యోగుల సమస్యలూ సవాలే!

ఈ విలీనం అమలులో ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన ప్రధాన సవాలు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్వీసు నిబంధనలు. పాఠశాల విద్యలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఇంటర్‌లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల విధులు, అర్హతలు, నియామక నిబంధనలు, సీనియారిటీ, పదోన్నతుల విధానాలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ రెండు వ్యవస్థలను కలిపే క్రమంలో ఎవరి సర్వీసు ప్రయోజనాలకూ నష్టం కలగకుండా చూడాలి.

జూనియర్ లెక్చరర్లకు ఉన్న ప్రత్యేక బోధనా బాధ్యతలు, ఇంటర్ స్థాయి విషయ పరిజ్ఞానం, విద్యార్హతలకు తగిన ప్రాధాన్యమివ్వాలి. స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల అవకాశాలు కూడా ప్రభావితం కాకూడదు. ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలతో ముందస్తు చర్చలు జరిపి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే సంస్కరణ లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉంది.

మౌలిక వసతులు సాధ్యమా?

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ తరగతులను ప్రారంభించాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. ప్రస్తుతం అనేక పాఠశాలల్లోనే తరగతిగదుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, ప్రయోగశాలల లేమి వంటి సమస్యలున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అదనపు తరగతుల నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది? ఇంటర్‌లో సైన్స్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ప్రయోగశాల లు తప్పనిసరి. లెక్చరర్లు, ప్రయోగశాల సహాయకులు, గ్రంథాలయాలు, డిజిటల్ బోధనా సదుపాయాలు కూడా అవసరం. ఇంటర్ అంటే పాఠశాలలో మరో రెండు తరగతులు జోడించడం కాదు. విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ.  విలీనం పేరుతో దాని ప్రత్యేకతను తగ్గించకూడదు.

కార్పొరేట్ కళాశాలలపై ప్రభావం.. 

ఈ నిర్ణయం కార్పొరేట్ విద్యాసంస్థలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఇంటర్ విద్య అందుబాటులోకి వస్తే అధిక ఫీజులు చెల్లించలేని పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ విద్యాసంస్థలను ఎంచుకోవచ్చు. ఫలితంగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి కొనసాగితే తల్లిదండ్రులు మళ్లీ ప్రైవేట్ కళాశాలల వైపు మొగ్గుచూపుతారు.

ముఖ్యంగా జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అవసరమైన బోధన, మార్గదర్శకత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో అందుబాటులో లేకపోతే కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతుంది. అందువల్ల ప్రభుత్వ విద్యను కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా నాణ్యతలోనూ పోటీపడగల వ్యవస్థగా తీర్చిదిద్దాలి.  అప్పుడే ఈ నిర్ణయానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.

వాసకర్త సెల్ : 9494019270

మరిన్ని వార్తలు