ఇంటర్మీడియెట్ ఇక మిథ్యేనా?

24-11-2026 | 05:10am

టీ చిరంజీవులు :

తెలంగాణ ప్రభుత్వం(Telangana government) 2027- 28 విద్యా సంవత్సరం(Academic Year) నుంచి ఇంటర్మీడియట్ విద్యను(Intermediate education) పాఠశాల విద్యలో విలీనం చేసి, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థను(Education System) ప్రవేశపెట్టాలని నిర్ణయించడం రాష్ట్ర విద్యారంగంలో ఒక ముఖ్యమైన పరిణామం. పదో తరగతి వరకు పాఠశాల విద్య(School Education), ఆ తర్వాత రెండేళ్లు ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యగా1970 నుంచి కొనసాగుతున్న ప్రస్తుత వ్యవస్థ స్థానంలో నిరంతరాయ విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒక సాహసోపేత నిర్ణయం. ముఖ్యంగా పదో తరగతి తర్వాత విద్యార్థులు(Students) చదువు మానేయకుండా చూడటం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రాష్ట్ర విద్యా కమిషన్, జాతీయ విద్యా కమిషన్ సిఫారసు చేశాయని చెప్పుతుంది.

విమర్శకులు, విద్యావేత్తల వాదనలు పరిపాలనా లోపాలు : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సుమారు మూడింట రెండొంతుల జిల్లాలకు రెగ్యులర్ జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవోలు), మండల విద్యాశాఖాధికారులు (ఎంఈవోలు) లేకపోవడం వల్ల పర్యవేక్షణ కొరవడిందని ఉపాధ్యాయ సంఘాలు, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇన్‌చార్జ్ అధికారుల వల్ల పరిపాలనాపరమైన జాప్యం జరుగుతున్నదని వారు పేర్కొంటున్నారు. 

మౌలిక సదుపాయాల కొరత : ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వసతులు, ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇంటర్మీడియట్ విలీనంపై ఆందోళన : జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో (10+2 విధానాన్ని 5+3+3+4 విధానంగా) విలీనం చేసే ప్రతిపాదనలపై విద్యావేత్తలు, జూనియర్ లెక్చరర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వ్యవస్థను బలోపేతం చేయకుండా, సరైన సన్నద్ధత లేకుండా ఇలాంటి మార్పులు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మార్పును కేవలం పరిపాలనా సంస్కరణగా కాకుండా, తెలంగాణ భవిష్యత్తు మానవ వనరులను తీర్చిదిద్దే సమగ్ర విద్యా విధానంలో భాగంగా చూడాలి. బోర్డుల విలీనం మాత్రమే విద్యా సంస్కరణ కాదు. నాణ్యమైన విద్య, సామాజిక సమానత్వం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కూడా దాని లక్ష్యాలుగా ఉండాలి.

1. డ్రాపౌట్స్ తగ్గించడమే లక్ష్యమా?

పదో తరగతి తర్వాత బాలికలు, పేద కుటుంబాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకు దూరమవుతున్న సమస్యను ప్రభుత్వం గుర్తించడం అభినందనీయం. జూనియర్ కాలేజీలు దూరంగా ఉండటం, రవాణా ఖర్చులు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బాలికల భద్రత వంటి అంశాలు ఉన్నత పాఠశాల విద్య కొనసాగింపునకు అడ్డంకులుగా ఉన్నాయి. యూఐఎస్‌ఈ 2024-25 గణాంకాల ప్రకారం తెలంగాణలో 9, 10 తరగతుల డ్రాపౌట్ రేటు 13.2 శాతంగా ఉండగా, జాతీయ సగటు 11.5 శాతంగా ఉంది.

ఈ పరిస్థితిని మార్చడానికి 12వ తరగతి వరకు ఒకే పాఠశాల వ్యవస్థలో చదువుకునే అవకాశం కల్పించడం ఉపయోగపడవచ్చు. అయితే విలీనం ఒక్కటే డ్రాపౌట్లను పూర్తిగా తగ్గించలేదు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, బాలికలకు హాస్టళ్లు, రవాణా సదుపాయాలు, ఆర్థిక సహాయం, సామాజిక భద్రత కూడా అవసరం. ఆడపిల్లల బాల్య వివాహాలు తగ్గించడం, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు, వారిపై మానసిక ఒత్తిడి తగ్గించడం లక్ష్యం కావచ్చును, కానీ తగు జాగ్రత్తలు తీసుకోకుంటే అది ప్రస్తుత ఇంటర్మీడియట్ విద్యను ఒక మిథ్యగా మార్చి సామాన్యునికి విద్యను దూరం చేస్తుంది. ప్రతికూల ఫలితాలు ఇస్తుంది.

2. విలీనం వేరు, ప్రమాణాలు వేరు 

సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ వంటి విద్యా బోర్డుల్లో 11, 12 తరగతులు ఇప్పటికే సీనియర్ సెకండరీ విద్యలో భాగంగా ఉన్నాయి. కాబట్టి ఇంటర్‌కు ప్రత్యేక బోర్డు లేకపోవడం నాణ్యమైన విద్యకు అడ్డంకి కాదు. అదే సమయంలో బోర్డుల విలీనం చేసినంత మాత్రాన విద్యా ప్రమాణాలు పెరుగుతాయని కూడా భావించలేం. ఇప్పటికే ఐఐటీ, నీట్ పరీక్షల్లో మనం అత్యధిక స్థానాలు సాధిస్తున్నాం. వాటి కోచింగ్‌కు ఒక ప్రత్యేక ఎకో సిస్టం కూడా అభివృద్ధి చెంది వుంది. ఈ హడావుడి సంస్కరణలు మన స్థానాన్ని దిగజార్చకూడదు.

తెలంగాణలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ వంటి గ్రూపులకు ప్రత్యేక బోధనా విధానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు అవసరం. ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక అకడమిక్ ప్రణాళిక అవసరం. అందువల్ల విలీనం తర్వాత కూడా 11, 12 తరగతులకు ప్రత్యేక అకడమిక్ విభాగం, అర్హులైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, ప్రమాణబద్ధమైన పరీక్షా విధానం కొనసాగాలి. అలాగే 9వ తరగతి నుంచే ర్యాంకుల పోటీ, ఐఐటీ, నీట్ కోచింగ్ ప్రారంభించడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కౌన్సెలింగ్, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మానసిక ఆరోగ్య సేవలు విద్యలో అంతర్భాగం కావాలి.

3. ప్రైవేట్ ఫీజుల నియంత్రణేది?

రాష్ట్ర విద్యారంగంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సమస్య ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అధిక ఫీజులు. ట్యూషన్ ఫీజులతో పాటు అడ్మిషన్, అభివృద్ధి రుసుములు, పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా, ఇతర చార్జీల రూపంలో తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం పడుతోంది. విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం, 1983లోని సెక్షన్ 7 ప్రకారం ఫీజుల నియంత్రణకు ప్రభుత్వానికి అధికారాలున్నాయి. రాష్ట్ర విద్యా కమిషన్ కూడా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం ఏర్పాటును ప్రతిపాదించింది.

అయితే ముసాయిదా బిల్లు సిద్ధం చేయడం వేరు, చట్టబద్ధమైన నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేయడం వేరు. ప్రభుత్వం స్వతంత్ర ఫీజుల నియంత్రణ చట్టం, కమిషన్‌ను ఏర్పాటు చేసి, పాఠశాలల వాస్తవ నిర్వహణ వ్యయం, ఉపాధ్యాయుల వేతనాలు, మౌలిక సదుపాయాలు వంటి అంశాల ఆధారంగా పారదర్శకమైన ఫీజుల విధానాన్ని రూపొందించాలి. ఇప్పటికే దేశంలోని ప్రైవేట్ విద్యా సంస్థల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది. రెండు చిన్నఈశాన్య గిరిజన  రాష్ట్రాలు మినహాయిస్తే మనమే మొదటి స్థానం. అది పట్టిక ౧లో చూడొచ్చు. 

ముఖ్యమైన అంశాలు : ఇంటర్ విలీనంపై చూపుతున్న చొరవను ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణపై కూడా చూపించాలి, లేనట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి బారులు తెరచినట్లుగా ఉంటుంది. తల్లిదండ్రులపై భారం మోపిన వారమవుతాం.

4. విద్యాహక్కు చట్టం ఎక్కడ? : విద్యాహక్కు చట్టం, 2009లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం అర్హులైన బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్, మైనారిటీ కాని పాఠశాలల్లో ప్రవేశ స్థాయిలో కనీసం 25 శాతం సీట్లు కేటాయించాలి.

ఈ నిబంధన ఉద్దేశం పేద పిల్లలకు కూడా నాణ్యమైన ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే అవకాశం కల్పించడం. విద్యాహక్కు చట్టం అమలు ప్రభుత్వానికి ఉన్న చట్టబద్ధమైన బాధ్యత. అది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంలో ఈ చట్టం 2009లో చేసింది. అప్పుడు రాష్ట్రంలో అమలు పరచలేదు, ఇప్పుడు కూడా అమలుపరచడం లేదు. అంటే వీరికి వారు చేసిన చట్టాలు కూడా వారు అమలుపరిచే నైతిక బాధ్యత లేదు. ఇది వీరికి పేద వారి విద్యపైన ఉన్న ప్రేమ. ఇప్పటికే దేశం లో నాలుగు రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి.

5. విద్యా బడ్జెట్ పెంచకుండా నాణ్యత ఎలా సాధ్యం? : విద్యా సంస్కరణలకు ప్రధానమైనది ఆర్థిక పెట్టుబడి. తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్ర బడ్జెట్లో కనీసం 18 శాతం విద్యకు కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి.

2014 నుంచి నేటి వరకు బడ్జెట్‌లో ఎంత శాతం కేటాయించారనేది పట్టిక -2ద్వారా స్పష్టమవుతుంది.  

(మూలాలు: 2014-15 నుంచి 2026-27 తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పత్రాలు) 

ఎ) 2014-15 నుంచి 2026- 27 వరకు మొత్తం బడ్జెట్ కేటాయింపు -27,34,309 కోట్లు.

బి)  మొత్తం విద్యా కేటాయింపులు- 2,05,455 కోట్లు- అంటే 7.51శాతం. ఇవి వాస్తవ  ఖర్చులు కావు . కేవలం కేటాయింపులు

సి) బడ్జెట్ కు ఆవల సుమారు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టారు. అవి ఇందులో లేవు.

డి) అలాగే 202౬--27 బడ్జెట్ గురుకుల పాఠశాల/ కళాశాల విద్యార్థులు ఖర్చులు సుమారు 6750.39 కోట్లు ఇందులో లేవు.

జాతీయ సగటు 14 నుంచి 15శాతం. పేద రాష్ట్రమైన బీహార్ బడ్జెట్ లో విద్యకు 20 శాతం, ఢిల్లీ 19శాతం,ఇతర రాష్ట్రాలు కూడా జాతీయ సగటు కంటే ఎక్కువగా కేటాయిస్తున్నాయి. కానీ తెలంగాణాలో గత 13 ఏళ్ళ కేటాయింపులు 7.51 శాతం మాత్రమే . విద్య పై  పాలకులకూ ఎంత ప్రేమ ఉందో ఇది చెప్పకనే చెప్పుతుంది.అందుకే అక్షరాస్యతలో దేశంలోని 28 రాష్ట్రాలలో తెలంగాణ 26వ స్థానంలో ఉంది. ప్రజలను అజ్ఞానులుగా చేసి తమ ఆధిపత్య కుల దోపిడీ పరిపాలన కొనసాగించడమే పాలకుల లక్యం. లక్షల కోట్లతో భారీ సాగు నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు చేపడతారు, కానీ మానవ వనరుల అభివృద్ధికి తోడ్పడే విద్యపై ఖర్చు చేయరు, ఇది బహుజనుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ దుస్థితి.

6. చదువు నైపుణ్యం ఉపాధి అనుసంధానం కావాలి : 12వ తరగతి వరకు విద్యను అందించడం మాత్రమే ప్రభుత్వ అంతిమ లక్ష్యం కాకూడదు. ఆ విద్య పూర్తిచేసిన విద్యార్థికి ఉద్యోగం పొందే సామర్థ్యం లేదా స్వయం ఉపాధి చేసుకునే నైపుణ్యం ఉండాలి. 9వ తరగతి నుంచే కంప్యూటర్ పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, వ్యవసాయ సాంకేతికత, సోలార్ ఎనర్జీ, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ప్రాథమిక నైపుణ్యాలను పరిచయం చేయాలి. దక్షిణ కొరియా వంటి దేశాల్లోని వృత్తి విద్యా నమూనాలను పరిశీలించి తెలంగాణ అవసరాలకు అనుగుణంగా అమలు చేయాలి. ఇప్పటికే ఉన్న ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, అడ్వాన్డ్స్ టెక్నాలజీస్ కేంద్రాలతో, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయంతో అనుసంధానం చేయాలి. పరిశ్రమల సహకారంతో అప్రెంటిస్‌షిప్, ప్రాక్టికల్ శిక్షణ తరగతులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. తెలంగాణలోని ప్రతి జిల్లాలో స్థానిక ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్య కోర్సులను రూపొందించాలి. వాటిని విద్యార్థులకు చేరువ చేయాలి.

7. సమగ్ర విద్యా సంస్కరణకు ప్రభుత్వ కార్యాచరణ :

1. తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు చేసిన 18 శాతం విద్యా బడ్జెట్ లక్ష్యాన్ని ఐదేళ్లలో దశలవారీగా సాధించాలి.

2.ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజుల నియంత్రణకు చట్టం చేసి, స్వతంత్ర చట్టబద్ధ కమిషన్ ఏర్పాటు చేయాలి.

3.విద్యాహక్కు చట్టం చట్టంలోని 25 శాతం ప్రవేశాల నిబంధనను అమలు చేయాలి.

4.ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరతను పరిష్కరించాలి.

5.9వ తరగతి నుంచి నైపుణ్య విద్యను సాధారణ విద్యతో సమానంగా ప్రోత్సహించాలి.

6. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, పరిశ్రమల మధ్య సమన్వయం పెంచాలి. దక్షిణ కొరియా లాంటి దేశాల సాంకేతిక పాఠశాలల విద్యను అధ్యయనం చేసి అమలు పరచాలి.

7.విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రత, కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

8. ఇవి అమలు చేయకుండా విలీనంతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. విలీనం కూడా సమగ్ర ప్రణాళికతో దశలవారీగా అమలు చేయాలి.

విలీనం కాదు సంస్కరణలు కీలకం

ఇంటర్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయడం పరిపాలనా సంస్కరణగా ఉపయోగపడవచ్చు. కానీ దానిని సంపూర్ణ విద్యా సంస్కరణగా మార్చాలంటే నాణ్యత, సమానత్వం, నైపుణ్యం, ఉపాధి అనే నాలుగు స్తంభాలపై నిర్మించాలి. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించకుండా, విద్యాహక్కు చట్టం చట్టాన్ని సమర్థంగా అమలు చేయకుండా, ప్రభుత్వ విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా, వృత్తి విద్యను విస్తరించకుండా కేవలం ఇంటర్ విలీనంతో విద్యారంగంలో మౌలిక మార్పు సాధ్యం కాదు. అది ఒక వృధా ప్రయాసగ మిగలవచ్చును. సమగ్ర విద్యాభివృద్ధే దేశాభివృద్ధి అని పాలకులు గుర్తించాలి. ఆ దిశలో సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే అందరికి శ్రేయస్కరంగా ఉంటుంది.

 వ్యాసకర్త :  విశ్రాంత ఐఏఎస్,

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్

మరిన్ని వార్తలు