వైయస్‌ఆర్ నగర్ భూములపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

02-11-2026 | 07:27pm

హనుమకొండ, నవంబర్ 02(విజయ క్రాంతి): కాజీపేట పోలీస్ స్టేషన్(Kazipet Police Station) ఎదురుగా ఉన్న వైయస్‌ఆర్ నగర్ కాలనీ (సర్వే నెం. 70, 71) లో సుమారు 30 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న పేదల భూమిని "ప్రైవేట్ ఆస్తి" అంటూ స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ మహిళా నేత రావు పద్మ రెడ్డి అన్నారు.

హనుమకొండ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావు పద్మ మాట్లాడుతూ హైదరాబాద్‌లో భూములు కబ్జా అయ్యాయని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే స్వయంగా ప్రైవేట్ వ్యక్తులకు వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 15 సంవత్సరాలుగా  అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆ భూములకు అప్పుడు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఆనాడు పట్టాలు ఇచ్చిఉంటే ఈరోజున ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ఇప్పుడు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారు అని విమర్శించారు. సీలింగ్ ఎక్సెస్ కింద ప్రభుత్వానికి చెందాల్సిన ఆ భూమిలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, మిగిలిన స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేలా బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగుతుందని త్వరలోనే పూర్తి ఆధారాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని స్పష్టం చేశారు. పేదల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే ఈ పోరులో వెనకడుగు వేసేది లేదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు