పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలి

12-11-2026 | 06:46pm

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

హనుమకొండ, నవంబర్ 12 (విజయ క్రాంతి):పరకాల లోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల లోని నూతన వంద పడకల ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి(Hospital Development) పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పాల్గొని ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై వైద్యాధికారులతో  సమీక్ష చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పాత భవనం నుండి నూతన భవనానికి బ్లడ్ బ్యాంకును తరలించి, అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. సీటీజీ యంత్రం, ఇతర అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

వైద్యుల సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్  లో అవసరమైన సదుపాయాలు కల్పించి, సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ- ఔషధి, ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ  సేవలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.ఆసుపత్రిలో ఓపి/ఐపీ సేవల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యులు, అధికారులకు సూచించారు.

పీఎం రాహత్ పథకం గురించి వైద్యాధికారులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో డిఎస్ వెంకన్న,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ, పరకాల మున్సిపల్ కమిషనర్ పవన్,  ఆర్ఎంవోలు డాక్టర్ నారాయణ రెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ ప్రవీణ్, ఇతర వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు