ఆ సినిమాలు నేనే చేయాల్సింది..

12-11-2026 | 06:36pm

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన మీనా(Actress Meena) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన సినీ ప్రయాణంలో కొన్ని అద్భుతమైన అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

అక్కినేని నాగార్జున, దర్శకుడు కృష్ణవంశీ(Nagarjuna Krishna Vamsi Movie) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం 'నిన్నే పెళ్లాడతా'(Ninne Pelladatha)లో నటించే అవకాశం తొలుత మీనాకు వచ్చిందట. కానీ అప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్టుకు డేట్స్ కేటాయించలేకపోయారు. దర్శకుడు 60 నుంచి 65 రోజుల కాల్షీట్లు అడగగా, తాను కేవలం 15 రోజులు మాత్రమే ఇవ్వగలనని చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. దీంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందని, సినిమా విడుదలైన తర్వాత తన నిర్ణయంపై బాధపడ్డానని తెలిపారు.

మరోవైపు రజనీకాంత్(Rajinikanth) నటించిన 'పడయప్ప' (తెలుగులో 'నరసింహ') సినిమాలోని నీలాంబరి పాత్ర కూడా తొలుత తన వద్దకు వచ్చిందని మీనా వెల్లడించారు. అయితే తన తల్లి ఆ పాత్ర తన ఇమేజ్‌కు సరిపోదని భావించడంతో ఆ అవకాశం చేజారిందని చెప్పారు. రజనీకాంత్‌తో తనకు అప్పటికే మంచి జోడీగా గుర్తింపు ఉండటంతో భిన్నమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రపై కుటుంబం సందేహం వ్యక్తం చేసిందని వివరించారు.

అయితే నీలాంబరి పాత్ర(Neelambari Character)లో రమ్యకృష్ణ అద్భుతంగా నటించారని మీనా ప్రశంసించారు. ఆ పాత్ర ఆమె కెరీర్‌లోనే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సినిమా చూసిన తర్వాత రమ్యకృష్ణకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు. ఈ రెండు సినిమాల్లో నటించే అవకాశం కోల్పోయినా, వాటి విజయాన్ని చూసి సంతోషించానని మీనా చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు