సవాల్‌ విసిరి.. సైడైపోయారా...

24-11-2026 | 08:29pm
  1. ద్వితీయ శ్రేణి నాయకుల హడావుడి
  2. ఎమ్మెల్యే క్యాంపు ఎదుట బీఆర్‌ఎస్‌ ఆందోళన

హనుమకొండ, నవంబర్ 24(విజయ క్రాంతి): కేటీఆర్ బహిరంగ సభ(KTR's public meeting) అనంతరం ఏర్పడ్డ సవాళ్ల పర్వం చివరికి ద్వితీయ శ్రేణి నాయకులకు తలనొప్పిగా మారింది. సోమవారం జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy) అభివృద్ధిపై హనుమకొండ చౌరస్తా కు చర్చకు రావాలని సవాలు విసరగా, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి రాజీనామా చేసి చివరస్తకు రావాలని ప్రతి సవాల్ విసిరిన నేపథ్యంలో డీసీసీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ నేతలు చౌరస్తాకు బయలుదేరగా పోలీసుల ఎంట్రీతో అడ్డుకట్ట వేశారు, అనంతరం బిఆర్ఎస్ కార్యాలయం నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటికి వచ్చే ప్రయత్నం చేశారు.

మాటల యుద్ధంతో రాజకీయ వేడి పుట్టించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ బహిరంగ చర్చకు రాకపోగా, వారి అనుచరులు మాత్రం రోడ్డెక్కారు. ఒకవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఆందోళన, మరోవైపు డీసీసీ భవన్‌ నుంచి చౌరస్తాకు బయలుదేరిన కాంగ్రెస్‌ నాయకులకు పోలీసుల అడ్డంకులు,వెరసి వరంగల్‌ పశ్చిమలో రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది. ఇరుపార్టీల నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు, స్వల్ప లాఠీచార్జితో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కాని సవాళ్లు విసిరిన ఇద్దరు నేతలు, సైడై పోయారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్‌ పశ్చిమ నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసరడంతో వివాదం మొదలైంది. దీనిపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ స్పందిస్తూ, నాయినికి దమ్ముంటే రాజీనామా చేయాలని, తాను పోటీకి సిద్ధమని ప్రతిసవాల్‌ చేశారు.

దీంతో నాయిని మరో అడుగు ముందుకేసి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు హనుమకొండ చౌరస్తాకు రావాలని పిలుపునిచ్చారు. గత పదేళ్లలో వినయ్‌ భాస్కర్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, తాను మూడేళ్లలో చేపట్టిన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే ఈ సవాళ్లకు తెరదించేలా ఇద్దరు నేతలు చర్చకు హాజరుకాకపోవడం, మరుసటి రోజు వారి అనుచరులు ఆందోళనలకు దిగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. నాయిని సవాళ్లపై నిలదీస్తూ, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని నినాదాలు చేశారు. క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.

అయినా బీఆర్‌ఎస్‌ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని అక్కడి నుంచి తరలించే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేశారు.ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతేకాదు,కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగినట్లు ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళనకు ప్రతిగా కాంగ్రెస్‌ శ్రేణులు కూడా రంగంలోకి దిగి,డీసీసీ భవన్‌ నుంచి హనుమకొండ చౌరస్తాకు వెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన జీఓలను వెంట తీసుకుని బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు.

చౌరస్తాకు రావాలని సవాల్‌ విసిరిన దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఇప్పుడు ముఖం చాటేశారని విమర్శించారు. చర్చకు రాని దాస్యం అంటూ నినాదాలు చేస్తూ చౌరస్తాలోనే చర్చకు కూర్చుంటామని పట్టుబట్టారు. అయితే కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు డీసీసీ భవన్‌ వద్దే అడ్డుకున్నారు. దీంతో అక్కడ కూడా తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

పలువురు కాంగ్రెస్‌ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు.ఇరుపార్టీల నాయకులు ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులను, డీసీసీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులను నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతకు దారితీశాయి.

ఇరువర్గాల నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఒకవైపు లాఠీచార్జి, మరోవైపు అరెస్టులతో పశ్చిమ నియోజకవర్గం రాజకీయ రణరంగాన్ని తలపించింది.

ఇద్దరు ప్రధాన నేతలు విసిరిన సవాళ్లకు సమాధానం బహిరంగ చర్చ రూపంలో వస్తుందా? లేక అనుచరుల ఆందోళనలు, ప్రతిఆందోళనలతోనే రాజకీయ పోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అనంతరం సుబేదారి, హనుమకొండ, కేయూ సిఐలు, తమ ప్రత్యేక బృందాల చేత బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గస్తీ నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు