ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
- సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్(BRS) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం(Saroor Nagar Tehsildar office)లో తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలను హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, నేటికీ అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్నికల హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్, పద్మానాయక్, సాగర్ రెడ్డి, జిన్నారం విఠల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చిరంజీవి, వరప్రసాద్ రెడ్డి, సత్యంచారి, శ్రీశైలం యాదవ్, రాజిరెడ్డి, తోట మహేశ్ యాదవ్, జక్కిడి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- కర్మన్ ఘాట్ చౌరస్తాలో ఆందోళన
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వకుండా పోలీసులతో అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కర్మన్ ఘాట్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, ప్రతిపక్ష నేతల గొంతుకను అణచివేసే వైఖరిని విడనాడాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆర్కేపురం, సరూర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు కొత్తపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ధర్నా నిర్వహించారు. నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి సరూర్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
