అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

07-09-2026 | 10:41pm

- హయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఎం నాయకులు 

ఎల్బీనగర్: పేదలందరికీ ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, చౌక ధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసరాలు సరఫరా చేయాలని, ప్రభుత్వ వైద్యశాలలను పటిష్టం చేయాలని సీపీఎం నాయకులు(CPM leaders) డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం హయత్ నగర్ తహసీల్దార్ కార్యాలయాన్ని( Hayat Nagar Tehsildar office) సీపీఎం నాయకులు ముట్టడించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.చంద్రమోహన్, జిల్లా కమిటీ సభ్యులు కీసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ...  పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. 

గ్రామాల్లో జీవనం కొనసాగించలేక హైదరాబాద్ కు వలసలు వచ్చి అద్దె ఇళ్లలో ఉంటూ దుర్భర జీవితాన్ని గడుపుతున్న పేదలకు  60 గజాల జాగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాహెబ్ నగర్ లోని ప్రభుత్వ భూములు(Government lands) అన్యాక్రాంతమవుతున్నాయని, ఆ భూమిని కాపాడటంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సాహెబ్ నగర్ కలాన్ లోని సర్వే నెంబర్ 71 లో ఉన్న149.34 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఆ భూమి మొత్తాన్ని  వీకర్ సెక్షన్ కాలనీకి ఇచ్చినప్పటికీ ఇంకా భూమి ఆక్రమణకు గురవుతుందని పేర్కొన్నారు. అలాగే, సర్వే నెంబర్ 162 లో ఉన్న 4.39 ఎకరాల భూమిలో ఇప్పుడు మూడెకరాలు కూడా లేని స్థితి ఉందన్నారు.  హయత్ నగర్ నుంచి ఇంజాపూర్ దారిలో ఉన్న  1.09 ఎకరాల భూమి పూర్తిగా అన్యాక్రాంతం అయింది, తక్షణమే కలెక్టర్  స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తలు