దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. డ్రోన్ ద్వారా మందుల పిచికారీ
ఉప్పల్,(విజయక్రాంతి): దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉప్పల్ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మల్కాజిగిరి ఉప్పల్-09 సర్కిల్ పరిధిలో దోమల నివారణ కోసం డ్రోన్ ద్వారా మందుల పిచికారీ చేపట్టారు. సీజన్లో దోమల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డ్రోన్ సహాయంతో దోమల నివారణ మందులను పిచికారీ చేస్తున్నారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, మురుగు కాలువలు, ఖాళీ ప్రదేశాలు, దోమలు వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా పిచికారీ చేపడుతున్నారు.
దోమల వ్యాప్తి నియంత్రణతో పాటు ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ సిబ్బంది పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. దోమల నివారణ చర్యల్లో భాగంగా డ్రోన్ సాంకేతికతను వినియోగించడం ద్వారా విస్తృత ప్రాంతాల్లో తక్కువ సమయంలో మందు పిచికారీ చేయడం సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని, చెత్తాచెదారం, నిల్వ నీటిని తొలగించాలని కోరారు.