బుగ్గారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
జగిత్యాల, నవంబర్ 26 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలోని బుగ్గారం పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ (Records Management), పెండింగ్ కేసుల పురోగతి, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం పాటించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులు, పెండింగ్ ట్రయల్స్‌కు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు. కమ్యూనిటీ పోలీసింగ్ (Community Policing)లో భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు, సామాజిక అంశాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల (CCTV Cameras) ప్రాముఖ్యతను గ్రామాల్లో వివరించి, ప్రతి గ్రామంలో వాటి ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.
నేరాల నియంత్రణలో విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి కానిస్టేబుల్ తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా లాఠీ వెంట ఉంచుకోవాలని సూచించారు.
ఈ తనిఖీలో ఎస్పీ వెంట ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.