మాదక ద్రవ్యాల రవాణా, నిర్మూలనకు విశిష్ట చర్యలు

26-11-2026 | 06:15pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా(Drug trafficking), వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత (District Collector K. Haritha) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎస్.పి. నితికా పంత్,  సబ్‌ కలెక్టర్ హర్షచౌదరి,  రాజస్వ మండల అధికారి లోకేశ్వర్‌రావు లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో మాదక ద్రవ్యాల నివారణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి సాగు చేసే వారిని, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల, కళాశాలకు 100 మీటర్ల లోపు గుట్కా, జర్దా, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, ఆయా పరిధిలోని షాపులలో విస్తృత తనిఖీలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆటోలు, తక్కులను తనిఖీలు చేపట్టాలని తెలిపారు.

జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు.ఎస్.పి. మాట్లాడుతూ గల నెల గంజాయి రవాణా చేసే వారిపై 6 కేసులు నమోదు చేయడం జరిగిందని, గంజాయి సాగు, రవాణా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించి, ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.అనంతరం జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ముఖ్యంగా పి.వి.టి.జి. లు, అంగన్వాడీ పిల్లల పై దృష్టి సారించాలని తెలిపారు.

ఆధార్ లేకపోవడము వల్ల ప్రభుత్వ పథకాలు దూరమవుతాయని తెలిపారు. 5, 15 సం||లు నిండిన వారు ఆధార్ అప్డేషన్ తప్పనిసరి చేసుకోవాలని, జన్మించిన ప్రతి ఒక్కరికి జనన ధృవీకరణ పత్రాలు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి.లు అశోక్, వహిదుద్దీన్. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా విద్యాధికారి నబిదానంద చారి, ఆబ్కారీ పర్యవేక్షకులు లక్ష్మణ్  నాయక్, మున్సిపల్ కమిషనర్లు తిరుపతి, అంజయ్య, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు