అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోతే బాధ్యులపై చర్యలు తప్పవు
క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈ రోల్ అబ్జర్వర్
జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) 2026 ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి(Roll Observer Bala Mayadevi) సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి, వివరాలను సరిచేసుకోవడానికి ప్రస్తుతం మంచి అవకాశం ఉందని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ఎస్ఐఆర్ 2026 ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతి విధివిధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన కొత్త గడువుల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఏఎస్‌డీడీ కేటగిరీలో ఉన్న ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను 100 శాతం పంపిణీ చేయడంతో పాటు వాటి సేకరణ, ధ్రువీకరణను కూడా వేగవంతం చేయాలన్నారు.
ఓటరు జాబితా నుంచి ఏదైనా ఓటరు పేరును తొలగించినప్పుడు అందుకు సరైన ఆధారాలు, సమర్థన ఉండాలని, అదేవిధంగా ఓటరు జాబితాలో పేరు చేర్చే ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా నిబంధనల ప్రకారం ధ్రువీకరించబడాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే అందుకు బాధ్యులైన అధికారులపై పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించి, నిర్ణీత గడువులో ఎస్ఐఆర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న 36 కేసులను తక్షణమే పరిష్కరించాలి...
జిల్లాలోని 020-కోరుట్ల, 021-జగిత్యాల, 022-ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 806 పోలింగ్ స్టేషన్లలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. మొత్తం 1,92,963 కేసులకు సంబంధించి నోటీసుల జారీ, పంపిణీ, విచారణ ప్రక్రియల్లో పురోగతి నమోదైందని, తుది ప్రచురణ 99.98 శాతానికి చేరిందని అధికారులు వివరించారు. ఇంకా 36 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో జగిత్యాల నియోజకవర్గంలో 35, ధర్మపురి నియోజకవర్గంలో ఒకటి ఉండగా, కోరుట్ల నియోజకవర్గంలో ఎలాంటి పెండింగ్ కేసులు లేవని తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న 36 కేసులను తక్షణమే పరిష్కరించి తుది ఓటరు జాబితా ప్రచురణను 100 శాతానికి తీసుకురావాలని అబ్జర్వర్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో అత్యధికంగా ఫారం-6 చేర్పులు, ఫారం-7 తొలగింపులు నమోదైన 20 పోలింగ్ స్టేషన్లను గుర్తించి, సంబంధిత ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేపట్టారా లేదా అన్నది తనిఖీ చేయాలన్నారు.
డీఈఓ, ఈఆర్ఓ స్థాయిలో చేపడుతున్న బహుళ అంచెల తనిఖీలను, బీఎల్ఓల ఇంటింటి సర్వే వివరాలను రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. మరణించిన, వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన, నకిలీ, గైర్హాజరు ఓటర్లకు సంబంధించిన వివరాలను డేటాబేస్‌లో నమోదు చేసిన సమాచారంతో క్షేత్రస్థాయి పరిశీలన వివరాలను సరిపోల్చి ధ్రువీకరించాలన్నారు.
ఏఎస్‌డీడీ (ASDD) కేటగిరీలో ఫారాల పంపిణీ, సేకరణ 100 శాతం జరగాలి....
జిల్లాలో ఏఎస్‌డీడీ కేటగిరీలో 74,738 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాలు సున్నాగా ఉండటంపై ప్రత్యేక దృష్టి సారించాలని అబ్జర్వర్ సూచించారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లకు రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి ఫారాల పంపిణీ, సేకరణ, క్షేత్రస్థాయి ధ్రువీకరణను వేగవంతం చేయాలన్నారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో నోటీసుల అందజేత, సంబంధిత వ్యక్తులకు విచారణ అవకాశం కల్పించడం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈఆర్ఓలు జారీ చేసే ఉత్తర్వులు ఈఆర్ఓనెట్ ద్వారా దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ రూపంలో సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించాలన్నారు.
సరిహద్దు జిల్లాల్లో డబుల్ ఎన్రోల్మెంట్ జరగకుండా క్రాస్ చెక్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని, 18–19 సంవత్సరాల వయస్సు కలిగిన 4,316 మంది యువ ఓటర్ల నమోదు, ఈపీఐసీ కార్డుల పంపిణీని వేగవంతం చేయాలని సూచించారు. ఎన్జీఆర్ఎస్ ద్వారా అందిన 112 ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. నివేదికల్లో డీఈఓ ధ్రువీకరించిన గణాంకాలు, ఇతర స్టేటస్ కాలమ్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేసి స్పష్టమైన, సమగ్రమైన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు.
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ లో క్షేత్రస్థాయి పరిశీలన...
సమీక్ష అనంతరం ఈ రోల్ అబ్జర్వర్ బి. బాలమాయా దేవి, జగిత్యాల ఆర్.డి.ఓ తో కలిసి జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ లో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియపై క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న ఎస్ఐఆర్ పనులను పరిశీలించి, బీఎల్ఓలను ప్రత్యక్షంగా కలిసి ఇప్పటివరకు నిర్వహించిన ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల పరిశీలన, ఫారాల స్వీకరణ, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, పెండింగ్‌లో ఉన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ఓటర్లందరి వివరాలు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత గడువులో ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ...
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 36 కేసులను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జగిత్యాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 35 కేసుల్లో జగిత్యాల అర్బన్‌లో 23, బీర్పూర్లో 10 కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
ఏఎస్‌డీడీ కేటగిరీలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరించి, ఫారాల పంపిణీ, సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఈపీఐసీ కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు లేకుండా తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి. ఓ.లు, తహసీల్దార్లు, ఏవో కిషన్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.