జిల్లా జోలికొస్తే ఖబడ్దార్
జనగామ, అక్టోబర్ 11 (విజయక్రాంతి): జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జనగామలో నిర్వహించిన బహిరంగ సభ(Public Meeting)లో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జనగామ జిల్లా ఏర్పాటు కోసం ప్రజలే పోరాడారని, జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కేసీఆర్ హయాంలోనే కలెక్టరేట్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, రోడ్ల విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా గతంలో 50 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేదని, కేసీఆర్ హయాంలో 3 లక్షల ఎకరాలకు నీరు అందించామని, మరో 2 లక్షల ఎకరాలకు నిధులు కేటాయించామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కొరతతో నీటిని ఎత్తిపోయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన కడియం శ్రీహరికి ఇప్పుడు జిల్లా గురించి మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. జనగామ జిల్లాను రద్దు చేసే ప్రయత్నాలు చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, కౌన్సిలర్లను కడియం శ్రీహరి లేదా ఇతర నాయకులు బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మూడు నెలల్లో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు, విద్యుత్ అందించాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం(Crop Loss Compensation) చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ రాజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.