టీయూడబ్ల్యూజే హెచ్-143 భూపాలపల్లి డివిజన్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
భూపాలపల్లి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana Union of Working Journalists) (టీయూడబ్ల్యూజే హెచ్-143) భూపాలపల్లి డివిజన్ నూతన కమిటీ(Bhupalpally Division Committee) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కన్వీనర్ మంతెన సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడిగా నిమ్మల సారయ్య (మొగుళ్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా దాసరపు ప్రశాంత్ (టేకుమట్ల), కోశాధికారిగా కటకం రాజు (రేగొండ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కొమురాజు రమేష్ (గణపురం), గజనాల మహేందర్ (చిట్యాల), గుర్రం స్వరాజ్ (రేగొండ), జాయింట్ సెక్రటరీలుగా గుర్రం శంకర్, బత్తిని విష్ణువర్ధన్, కార్యవర్గ సభ్యులుగా సుంకరపల్లి దేవేందర్, క్యాతం వినయ్, వేముల నవీన్, ఆకునూరి సతీష్, బండారి తిరుపతి, బండారి రమేష్ ఎన్నికయ్యారు.
అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజనారాయణ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజాసమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యంగా పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.