టీబీ రహిత గ్రామంగా అబ్దుల్ నగరం
సర్పంచ్ కావటి సుధాకర్ కు కలెక్టర్ చేతుల మీదుగా టీబీ ముక్త్ అవార్డు
తరిగొప్పుల, అక్టోబర్ 8 (విజయక్రాంతి): క్షయ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి అబ్దుల్ నగరం గ్రామం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తరిగొప్పుల మండలం అబ్దుల్ నగరం గ్రామ సర్పంచ్ కావకటి సుధాకర్ ను టీబీ ముక్త్ అవార్డు తో ఘనంగా సత్కరించారు.
గ్రామంలో క్షయ వ్యాధి నిర్మూలనకు సర్పంచ్ చేసిన ప్రత్యేక కృషి, ప్రజల్లో తెచ్చిన చైతన్యం, రోగుల గుర్తింపు, వైద్యానికి తరలింపులో చూపిన చొరవకు ఈ అవార్డు దక్కింది. జిల్లాలోనే టీబీ రహిత గ్రామంగా అబ్దుల్ నగరం నిలవడం పట్ల కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వాణిశ్రీ, డాక్టర్ మల్లికార్జున, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.