మహిళా ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం
1000 రోజుల పాలనలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లు ఏమయ్యాయి
ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం
ప్రజాతీర్పును అవమానిస్తే ప్రజలే బుద్ధి చెబుతారు
మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలన పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మూడు డిక్లరేషన్లలో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని వరంగల్ రూరల్ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మాజీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న సమరభేరి కార్యక్రమం(BRS Samarabheri Program)లో భాగముగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గండ్ర జ్యోతి పార్టీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం అంబేద్కర్ కూడలి నుంచి జయశంకర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ... అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదని, అధికారం శాశ్వతం కాదని అన్నారు. ప్రజా తీర్పును అవమానిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని గండ్ర జ్యోతి హెచ్చరించారు.