ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు మోక్షం ఎప్పుడో?
08-09-2026 | 08:15pm
ప్రారంభించి ఏడాది దాటినా పూర్తికాని నిర్మాణం
నాగలిగిద్ద,(విజయ క్రాంతి): నాగలిగిద్ద మండల(Nagaligidda Mandal) కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్(Indiramma Model House) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభించి సంవత్సరం దాటినా నేటికీ పూర్తి కాకపోవడంపై మండల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు మోడల్ హౌస్‌ను పరిశీలించి, అదే నమూనాలో ఇళ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేసింది. అయితే నిర్మాణ పనులు ఆలస్యం కావడంపై మండల హౌసింగ్ ఏఈ నిర్లక్ష్యమే కారణమని ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి మోడల్ హౌస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.