శాత్రాజ్‌పల్లిలో అర్ధరాత్రి బుల్డోజర్ల బీభత్సం
- అడ్డుకున్నా ఆగని కూల్చివేతలు!
- 8 జెసిబి లతో 400 కు పైగా ఇళ్లు నేలమట్టం
- భారీగా పోలీసుల మోహరింపు
- నోటీసులు ఇవ్వలేదంటూ బాధితుల ఆవేదన..
- పరిహారం కోసం డిమాండ్
- కలెక్టర్ స్పందించాలని బాధితుల విజ్ఞప్తి
భూపాలపల్లి /మల్హర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) తాడిచర్లలో అర్ధరాత్రి భారీ కూల్చివేతలు కలకలం రేపాయి. మండల కేంద్రంలోని శాత్రాజ్‌పల్లిలో శనివారం అర్ధరాత్రి రెవెన్యూ, పోలీసు, సింగరేణి(Singareni), అగ్నిమాపక శాఖల అధికారులు(Fire department officials) భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. సుమారు ఎనిమిది జేసీబీలతో 400 ఇళ్లను నేలమట్టం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ చర్యకు సుమారు 200 మందికి పైగా పోలీసులు బందోబస్తుగా ఉన్నట్లు సమాచారం.
కూల్చివేతల విషయం తెలుసుకున్న తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి గ్రామస్తులతో కలిసి అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకున్నారు. ముందుగా గ్రామసభ నిర్వహించాలని, బాధితులకు నోటీసులు ఇచ్చిన అనంతరం మాత్రమే చర్యలు చేపట్టాలని కోరారు. పేదలు అప్పులు చేసి లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లను అర్ధరాత్రి కూల్చివేయడం సరికాదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కూల్చివేతలు కొనసాగాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటి సామగ్రి కూడా తీసుకోలేకపోయాం
తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకపోవడంతో ఇళ్లలోని సామగ్రిని సైతం బయటకు తీసుకునే అవకాశం లేకుండా పోయిందని బాధితులు వాపోయారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కలపను అటవీశాఖ అనుమతులు, రుసుములు చెల్లించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చామని తెలిపారు. ఒక్కసారిగా ఇళ్లను కూల్చివేయడంతో తమ జీవనాధారం, ఆస్తులు కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.
తాడిచర్ల బ్లాక్-2 నేపథ్యంలోనేనా?
తాడిచర్ల బ్లాక్-2 గని కార్యకలాపాల నేపథ్యంలోనే ఈ కూల్చివేతలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే కూల్చివేతలకు ముందు బాధితులకు నోటీసులు ఇచ్చారా? పునరావాసం, పరిహారం కల్పించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
అర్ధరాత్రి ఇళ్ల కూల్చివేతలపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయడంతో పాటు తగిన పరిహారం, పునరావాసం కల్పించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు. పేదల ఇళ్ల కూల్చివేతల వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.