'బెస్ట్ ఇమేజ్’ అవార్డుతో శ్రవణ్‌కు ఘన గుర్తింపు
వెంకటాపూర్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రవణ్ జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో ప్రతిభ చాటారు. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ ఫోటోగ్రఫీ పోటీ లో ఆయన సమర్పించిన ఛాయాచిత్రానికి ప్రతిష్ఠాత్మకమైన ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ‘మై ఇండియా: 80 ఇయర్స్ ఆఫ్ డెమోక్రసి అండ్ ఫ్రీడమ్’ అంశంపై నిర్వహించిన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి 182 మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొని 352 ఛాయాచిత్రాలను సమర్పించారు.
ప్రముఖ జ్యూరీ సభ్యులు ఛాయాచిత్రాలను పరిశీలించి వివిధ విభాగాల్లో 60 అవార్డులకు విజేతలను ఎంపిక చేశారు. అందులో శ్రవణ్ సమర్పించిన చిత్రం అత్యుత్తమంగా నిలిచి ‘బెస్ట్ ఇమేజ్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారానికి ఎంపికైంది. అవార్డు ప్రదానోత్సవం అక్టోబర్ 2న గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను విశ్వవిద్యాలయం తరఫున గోల్డ్ మెడల్స్‌తో సత్కరించనున్నారు. పాలంపేటకు చెందిన శ్రవణ్ జాతీయ స్థాయిలో అవార్డు సాధించడం పట్ల స్థానికులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.